Silver Prices: ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్‌లో కూడా వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా వెండి కొత్త రికార్డులను నమోదు చేస్తుండగా, భారత్‌లో ధరలు కిలో వెండికి రూ.2.5 లక్షల మైలురాయిని దాటడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రికార్డు వెనుక గ్లోబల్, దేశీయ కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు పెరగడానికి కారణాలేంటి?
అంతర్జాతీయ కారణాలు
అంతర్జాతీయంగా వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం బలమైన పారిశ్రామిక డిమాండ్. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. గత చక్రాలతో పోలిస్తే ఈసారి వెండికి డిమాండ్ నిర్మాణాత్మకంగా (structural) బలపడిందని నిపుణుల అభిప్రాయం. ఇదే సమయంలో, మైనింగ్ రంగంలో సంవత్సరాలుగా పెట్టుబడులు తగ్గిపోవడంతో సరఫరా పరిమితంగా ఉంది. డిమాండ్‌కు సరఫరా తగినంతగా లేకపోవడం ధరలను మరింత పైకి నెట్టింది. ఇన్వెస్టర్ల ఆసక్తి మళ్లీ పెరగడంతో వెండి ధరలు వేగంగా ఎగబాకాయి.
“అందరూ ఒకే వస్తువును కొంటుంటే జాగ్రత్త అవసరం”
మార్కెట్ నిపుణుడు గోరక్షకర్ వెండి ధరలపై హెచ్చరికలతో కూడిన అభిప్రాయం వ్యక్తం చేశారు. “అందరూ ఒకే కమోడిటీని, అదీ అత్యధిక ధరల వద్ద కొనడం మొదలుపెడితే ఏదో తేడా జరుగుతోందని అర్థం,” అని ఆయన వ్యాఖ్యానించారు. టెక్నికల్ అనలిస్టులు ఊహించని స్థాయిలను వెండి దాటిందని పేర్కొన్న ఆయన, తక్కువ కాలంలో లాభాల స్వీకరణ (profit booking) జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. అయితే, వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో వెండికి డిమాండ్ బలంగా ఉంటుందన్న నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.
“ఈ స్థాయిల్లో వెండి ETFలు గానీ, డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గానీ చేయాలంటే కొంతకాలం వేచి చూడడం మంచిది. సుమారు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు పెట్టుబడిదారులకు మంచి ప్రవేశ అవకాశం లభిస్తుంది,” అని గోరక్షకర్ సూచించారు.
ఇప్పుడే వెండి కొనాలా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది పూర్తిగా ఇన్వెస్టర్ టైమ్ , రిస్క్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకు: రికార్డు స్థాయిల్లో కొనుగోలు చేయడం ప్రమాదకరం. పెద్ద ర్యాలీల తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది.
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు: వెండి ఇంకా బలంగానే ఉంది. పారిశ్రామిక లోహంగా, ప్రెషియస్ మెటల్‌గా ఉన్న వెండి భవిష్యత్తులో కీలకం కానుంది.
గ్లోబల్ మార్కెట్లలో ధరల పెరుగుదలతో పాటు రూపాయి కరెన్సీ కదలికలు కూడా భారత మార్కెట్‌పై ప్రభావం చూపాయి. దీని ఫలితంగా దేశీయంగా వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

