Lorry Hits Bike: లారీ ఢీకొనడంతో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న అక్కా-తమ్ముడు దుర్మరణం
సత్తుపల్లి, స్వేచ్ఛ: వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో టూవీలర్‌పై (Lorry Hits Bike) ప్రయాణిస్తున్న అక్కా, తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దుర్ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెనుబల్లి మండలం సూర్య బంజర్ తండాకు చెందిన పుచ్చ కృష్ణయ్య, రమ్యాదేవి దంపతుల కుమార్తె తేజస్విని (21)కి చింతలపూడి మండలం కండ్రిక వారిగూడెం గ్రామానికి చెందిన తోట మధుతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. మృతురాలు తేజస్వినికి తమ్ముడు పుచ్చ దేవేందర్ (14) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారెప్పగూడెం మండలం చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
Read Also- Cylinder Explosion: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అపార్ట్మెంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన తమ్ముడిని, తల్లిదండ్రులను చూసేందుకు తేజస్విని, ఆమె భర్త మధు గ్రామానికి వెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణంలో పెనుబల్లి మండలం సూర్య బంజర్ నుంచి బయలుదేరి సత్తుపల్లి పట్టణ శివారులోని తమ్మిలేరు వంతెనపైకి చేరుకున్న సమయంలో ఖమ్మం నుంచి అశ్వరావుపేట వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి టూవీలర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో టూవీలర్‌పై వెనుక కూర్చున్న తేజస్విని, ఆమె తమ్ముడు దేవేందర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. టూవీలర్ నడుపుతున్న తోట మధు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
Read Also- KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.. నాగర్‌కర్నూల్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రమాదంలో మృతి చెందిన తేజస్విని, దేవేందర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

