Delhi Murder Suicide: దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిగరేట్ కు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మెడకు తాడు బిగించి ప్రాణాలు తీశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఆపై రైలు పట్టాల కింద పడి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన దిల్లీలో తీవ్ర చర్చకు దారి తీసింది.
వివరాల్లోకి వెళ్తే..
డిసెంబర్ 25న వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూర్బా నగర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మహేందర్ కౌర్ అనే మహిళ తన ఇంట్లో హత్యకు గురికాగా.. ఆమె భర్త కుల్వంత్ సింగ్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంట్లోని మంచంపై మహేందర్ కౌర్ మృతదేహం దుప్పటిలో చుట్టి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఇంట్లో ఆమె భర్త లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కుమారుడి వాంగ్మూలంతో అనుమానాలు
మహేందర్ కౌర్ దంపతులకు 21 ఏళ్ల కుమారుడు శివచరణ్ ఉన్నాడు. తొలుత అతడ్ని పోలీసులు విచారించగా.. తన తల్లిది ఆత్మహత్య అని వాగ్మూలం ఇచ్చాడు. తాను సిగరేట్లు కొనడానికి బయటకు వెళ్లి వచ్చేసరికి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించిందని అతడు తెలిపాడు. అయితే అతడు పదే పదే తన వాంగ్మూలాన్ని మారుస్తుండటంతో పోలీసులకు అనుమానం మెుదలైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. మెడపై ఉరి బిగించిన గుర్తులు కనిపించాయి. ఆమెను గొంతు నులిమి చంపినట్లు వైద్యులు నిర్ధారించారు.
సిగరేట్ కోసం గొడవ..
దీంతో కుమారుడ్ని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిజాలు వెలుగు చూశాయి. సిగరేట్ కొనడానికి రూ.20 ఇవ్వమని భార్యను కుల్వంత్ సింగ్ అడగడంతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె డబ్బు ఇవ్వకపోవడంతో గొడవ తీవ్రస్థాయికి చేరిందని చెప్పారు. అయితే ఆ తర్వాత డబ్బు ఇచ్చినప్పటికీ భర్త కోపం చల్లారలేదన్నారు. దీంతో కొడుకును బయటకు పంపించి.. భార్యను గొంతు నులిమి కుల్వంత్ సింగ్ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.
Also Read: Kalvakuntla Kavitha: కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ.. పాలమూరు – రంగారెడ్డిపై పెట్టలే.. బీఆర్ఎస్‌పై కవిత ఫైర్
రైలు కింద పడ్డ భర్త
ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే కుల్వంత్ సింగ్ మృతదేహం సమీప రైల్వే పట్టాలపై పోలీసులకు లభించింది. వేగంగా వెళ్తున్న రైలు కింద తనంతట తానే కుల్వంత్ సింగ్ పడ్డారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.

