Toy Train Kailasagiri: విశాఖపట్నంలోని కైలాసగిరిలో సందర్శకుల కోసం నడుపుతున్న టాయ్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ కు సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రైలు ఒక్కసారిగా వెనక్కి వెళ్లింది. ఘటన సమయంలో రైలులో 100 మంది వరకూ సందర్శకులు ఉన్నట్లు సమాచారం. అయితే ట్రైన్ రివర్స్ లోకి వెళ్లినప్పటికీ ఎక్కడా పల్లం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత టాయ్ ట్రైన్ దానంతట అదే ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షేమంగా రైలు నుంచి బయటకు వచ్చేశారు.
ఎందుకు అలా జరిగింది?
టాయ్ ట్రైన్ రివర్స్ వెళ్లిన ఘటన శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రైన్ బ్రేకులు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అన్న కోణంలో నిర్వాహకులు ఆరా తీస్తున్నారు. ఓవర్ లోడ్ కారణంగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయా? ఇంకేదైనా కారణముందా? అన్న కోణంలో ట్రైన్ ను పరిశీలిస్తున్నారు. కాగా, క్రిస్మస్, న్యూయర్ సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలోని కైలాసగిరిలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటోంది. ఇలాంటి సమయంలో ఈ తప్పిదం చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు తావిస్తోంది. ఈ ఘటన సందర్శకుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
బ్రేకులు ఫెయిలై వెనక్కి వెళ్లిన టాయ్ ట్రైన్.. తృటిలో తప్పిన ప్రమాదం
విశాఖ-కైలాసగిరిపై సందర్శకుల కోసం నడుపుతున్న టాయ్ ట్రైన్
నిన్న సందర్శకులతో వెళుతుండగా ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలై ఘటన
ఆ సమయంలో ట్రైన్లో 100 మంది వరకు ఉన్నట్లు సమాచారం
ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న… pic.twitter.com/rHxEx1qJIb
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2025
టాయ్ ట్రైన్ విషయానికి వస్తే..
కైలాసగిరి హిల్ టాప్ పార్కులో ఈ టాయ్ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కైలాసగిరి చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఈ టాయ్ ట్రైన్ లో ప్రయాణించేందుకు ఎంతగానో ఇష్టపడుతుంటారు. కైలాస గిరి అందాలు, విశాఖ సముద్ర తీరం కనిపించేలా ప్రయాణిస్తూ ఈ ట్రైన్ పర్యాటకులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచుతుంటుంది. ఇక ఈ ట్రైన్ టికెట్ ధరల విషయానికి వస్తే పెద్దలకు రూ.100-150గా నిర్ణయించారు. చిన్నారులకు రూ.80-100 గా టికెట్ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకూ ఈ ట్రైన్ సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.
Also Read: Operation Aaghat 3.0: దిల్లీలో స్పెషల్ ఆపరేషన్.. 24 గంటల్లో 660 మందికి పైగా అరెస్టు.. ఎందుకంటే?
మరో ఆకర్షణగా గ్లాస్ బ్రిడ్జి
కైలాసగిరిలో మరో ఆకర్షణగా గ్లాస్ బ్రిడ్జిని నిర్మించారు. రూ.7 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ గాజు వంతెన ఇటీవలే పర్యాటకుల కోసం అందుబాటులోకి వచ్చింది. సముద్ర మట్టానికి 1020 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. 10 నిమిషాల పాటు నిలబడి ప్రకృతిని అస్వాదించేందుకు రూ.300 ఛార్జ్ చేస్తున్నారు. విశాఖ సాగర తీరం, కైలాసగిరి అందాలను వంతెనపై నుంచి వీక్షించవచ్చు.

