Bangladeshi Singer: బంగ్లాదేశ్ లో తలెత్తిన అంతర్యుద్ధం రోజు రోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల హిందువులపై దాడులు చేస్తూ వచ్చిన అల్లరి మూకలు.. తాజాగా అక్కడి ప్రముఖ రాక్ స్టార్ ను టార్గెట్ చేశాయి. ప్రముఖ సింగర్ జేమ్స్ తలపెట్టిన మ్యూజిక్ కన్సార్ట్ పై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. దీంతో ఢాకాకు 120 కి.మీలో ఏర్పాటు చేసిన అతడి మ్యూజిక్ కచేరి అర్ధాంతరంగా రద్దయ్యింది. అల్లరి మూకలు జరిపిన దాడిలో 25 మందికి పైగా గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే?
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఫరిదాపూర్ లో శుక్రవారం రాత్రి 9 గంటలకు ఓ పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొందరు దుండగులు వేదిక వద్దకు వచ్చి భయోత్పాతాన్ని సృష్టించారు. కన్సార్ట్ కోసం వచ్చిన ప్రేక్షకులపై ఇటుకలు, రాళ్లతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. సింగర్ నిలబడి ఉన్న వేదికపైకి ఎక్కి హల్ చల్ చేశారు. దీంతో స్థానిక అధికారులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మ్యూజిక్ కన్సార్ట్ ను రద్దు చేశారు. కాగా దుండగుల రాళ్లదాడిలో 25 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రముఖ సింగర్ జేమ్స్ త్రుటిలో దాడి నుంచి తప్పించుకున్నట్లు తెలిపింది.
Just now 🚨
Islamist mob attacks a concert of Bangladesh's biggest rockstar, James Baul, at Faridpur.
The Islamists want music gone from Bangladesh.
25 people were injured in the incident, most of them students.
Video 📷#Bangladesh #NagarBaul #Dhaka pic.twitter.com/KLcrFuQxjQ
— Globally Pop (@GloballyPop) December 27, 2025
తస్లీమా నస్రీన్ తీవ్ర ఆగ్రహం
రాక్ స్టార్ షోపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ నాయకురాలు తస్లీమా నస్రీన్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ కళలపై జరిగిన దాడిగా దీనిని అభివర్ణించారు. జిహాదీల వల్ల ప్రముఖ సింగర్ జేమ్స్ తన మ్యూజిక్ కన్సార్ట్ ను నిర్వహించుకోలేకపోయారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కుమారుడు సిరాజ్ అలీ ఖాన్ ఇటీవల బంగ్లాదేశ్ కు వచ్చి చేసిన వ్యాఖ్యలను సైతం ఈ సందర్భంగా తస్లీమా ప్రస్తావించారు. బంగ్లాదేశ్ లో సంగీతం, సాంస్కృతిక రంగాలు సురక్షితంగా ఉన్నాయని తేలేవరకూ ఢాకాలో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించనని ఆయన శపథం చేశారని పేర్కొన్నారు. ఇటీవల ఉస్తాద్ రషీద్ ఖాన్ కుమారుడు ఆర్మాన్ ఖాన్ సైతం ఢాకా ఆహ్వానాన్ని తిరస్కరించారని తస్లీమా తెలిపారు.
Also Read: Shivaji Controversy: తొడలు కనబడుతున్నాయనే.. నన్ను చూస్తున్నారు.. శివాజీ వివాదంపై శ్రీరెడ్డి కౌంటర్
జేమ్స్ ఎందుకంత ఫేమస్..
ఇక రాక్ స్టార్ జేమ్స్ విషయానికి వస్తే ఆయన బంగ్లాదేశ్ లో మంచి పేరున్న గాయకుడు. ‘నగర్ బౌల్’ అనే పేరుతో నడిపే ప్రముఖ రాక్ బ్యాండ్ లో అతడు ప్రధాన సింగర్. పాటలు రాయడం, గిటార్ ప్లే చేయడంలోనూ జేమ్స్ కు ప్రావీణ్యం ఉంది. పలు హిందీ చిత్రాలకు సైతం ఆయన తన స్వరాన్ని అందించారు. గ్యాంగ్ స్టర్ సినిమాలో ‘భీగీ భీగీ’, లైఫ్ ఇన్ ఏ మెట్రో చిత్రంలో ‘అల్విదా’ వంటి పాటలు పాడి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనకు బంగ్లాదేశ్ తో పాటు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. అలాంటి జేమ్స్ మ్యూజిక్ కన్సార్ట్ మీద దాడి జరగడం ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను మరోమారు ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది.

