Terrorist In Market: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులపై సాయుధ బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. సమాచారం అందితే చాలు రంగంలోకి దిగి మట్టుపెడుతున్న క్రమంలో, శుక్రవారం నాడు అనంత్‌నాగ్ జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన మొహమ్మద్ లతీఫ్ అనే ఉగ్రవాది కలకలం రేపాడు. స్థానిక మార్కెట్‌లో (Terrorist In Market) అతడు కనిపించాడు. వెంటనే ఈ సమాచారం భద్రతా బలగాలకు చేరింది. దీంతో, లతీఫ్ కోసం సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉమ్మడి పరస్పర సహకారంతో ఆపరేషన్ చేపట్టారు. అయితే, భద్రతా బలగాలు చుట్టుముట్టేలోపే ఉగ్రవాది లతీఫ్ పక్కనే ఉన్న అడవుల్లోకి పరారయ్యాడు.
భద్రతా బలగాలు చుట్టుముట్టక ముందే, ఉగ్రవాది లతీఫ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయాడని అధికారులు వెల్లడించారు. వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టామని, సమీపంలోని ప్రాంతాల్లో గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే, దట్టమైన అడవిని అవకాశంగా మలుచుకొని తప్పించుకున్నాడని అన్నారు. లతీఫ్ కోసం వేట కొనసాగుతోందని, సెక్యూరిటీ ఏజెన్సీలు చాలా అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. కాగా, ఈ ఏడాది నవంబర్ నెలలోనే లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో లతీఫ్ చేరాడు. దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో అతడు యాక్టివ్‌గా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పటికే గుర్తించాయి.
శ్రీనగర్‌లో పటిష్ట చర్యలు
ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఎదురుకాకుండా భద్రతా బలగాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు శ్రీనగర్‌లోని కీలక ప్రాంతాలలో విధ్వంస వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాయి. ముందస్తు భద్రతా చర్యలను పటిష్టం చేయడం, ఉగ్ర ముప్పులను తిప్పికొట్టే లక్ష్యంతో శ్రీనగర్ నార్త్ జోన్‌లోని కీలక సంస్థలు, సున్నితమైన ప్రాంతాల చుట్టూ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు కలిసి ఏరియా సెక్యూరిటీ, యాంటీ-సాబోటేజ్ (AST) ఆపరేషన్లు నిర్వహించాయి. ఈ విషయాన్ని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, బలగాల సన్నద్ధతను పెంచడం, కీలకమైన మౌలిక సదుపాయాలతో పాటు సాధారణ ప్రజల భద్రతను నిర్ధారించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాల ముఖ్యఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో గుర్తించిన ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. అనంతనాగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా కసరత్తులు నిర్వహించినట్టు వెల్లడించారు.
Read Also- KTR and Kavitha: కవిత మాటలకు కేటీఆర్ కౌంటరా? మౌనమా? నాగర్‌కర్నూల్లో అన్నాచెల్లెళ్ల రాజకీయ పోరుబాట!

