KTR and Kavitha: కందనూలు జిల్లా కేరాఫ్ గా అన్నాచెల్లెళ్ల రాజకీయ పోరుబాట రాష్ట్ర రాజకీయాలలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. రోజు వ్యవధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. దీంతో ఎవరు, ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కేటీఆర్, కవితల పర్యటనలను విజయవంతం చేసేందుకు ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు జాగృతి శ్రేణులు సన్నద్ధం అయ్యాయి.
కందనూలులో అన్నాచెల్లెళ్ల రాజకీయ పోరుబాట!
నాగర్‌కర్నూల్ జిల్లాలో రేపు (ఈనెల 27న శనివారం) కేసీఆర్ తనయ, కేటీఆర్ చెల్లెలు, జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంపుహౌజ్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, కొల్లాపూర్ మామిడి మార్కెట్ను పరిశీలిస్తారు. అలాగే పెంట్లవెల్లి మండల కేంద్రంలో రైతురుణమాఫీ బాధితులతో, పెద్దకొత్తపల్లిలో ఎరుకల సంఘం, ముదిరాజ్ సంఘ సభ్యులతో సమావేశమవుతారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీని, వట్టెం పంపుహౌజ్, సిర్సవాడ బ్రిడ్జి ప్రాంతాన్ని సందర్శిస్తారు.
Also Read: MLC Kavitha: పండగంటే పది మందితో కలిసి ఆనందంగా జరుపుకోవడం: ఎమ్మెల్సీ కవిత
కేటీఆర్, కవితలు పర్యటిస్తుండటం గమనార్హం
ఇక కేటీఆర్ 28 తేదీన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో గెలిచిన సర్పంచుల సమావేశంలో పాల్గొంటారు. ఇలా కేవలం ఒక్క రోజు వ్యవధిలో నాగర్ కర్నూలు జిల్లాలో కేటీఆర్, కవితలు పర్యటిస్తుండటం గమనార్హం. బీఆర్ఎస్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా కవిత సంచలన వాగ్భాణాలు సంధిస్తూ వస్తున్నారు. కానీ కేసీఆర్ తో సహా ఎవరూ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం లేదు. దీంతో పార్టీ శ్రేణులను లక్ష్యంగా ఎంచుకొని కవిత మాట్లాడుతున్న తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
కవిత ఈ పథకంపై ఏం మాట్లాడతారోననే చర్చ ఆసక్తి
ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా మార్చుకునేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్న క్రమంలో కవిత కూడా ఈ ప్రాజెక్టును సందర్శించనుండటం ఇక్కడ ప్రత్యేకం. బీఆర్ఎస్ హయాంలోని లోపాలను ఎత్తిచూపుతున్న కవిత ఈ పథకంపై ఏం మాట్లాడతారోననే చర్చ ఆసక్తి రేకిస్తోంది. అలాగే కాంగ్రెస్ తో పాటుగా, బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని స్థానిక బీఆర్ఎస్ నాయకుల తీరును ఎండగడుతుండటంతో కవిత పర్యటనను ఆ రెండు పార్టీలూ నిశితంగా గమనిస్తున్నాయి. ఇక అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల సర్పంచ్ల సన్మానంలో పాల్గొంటున్న కేటీఆర్ కూడా పార్టీ బలోపేతం కోసం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఏం మాట్లాడతారన్నదీ ఉత్కంఠ కలిగిస్తోంది. శనివారం కవిత మాట్లాడే మాటలకు కేటీఆర్ ఏమైనా కౌంటర్ ఇస్తారా, మిన్నకుండి పోతారోననేది రెండు రోజుల్లో తేలనుంది. మొత్తం మీద కందనూలు జిల్లాలో రోజు వ్యవధిలో అన్నాచెల్లెళ్లు పర్యటిస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: Kavitha: కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి.. కేటీఆర్ హరీష్ రావుల అరాచకాలు.. కవిత తీవ్ర విమర్శలు

