Udaipur Incident: ఆమె ఒక కంపెనీకి మేనేజర్. బర్త్ డే పార్టీకి ఆహ్వానిస్తే వెళ్లింది. అదే కంపెనీ సీఈవో, ఆ కంపెనీ ఉమెన్స్ ఎగ్జివ్ హెడ్‌గా ఉన్న మహిళ, ఆమె భర్తతో కలిసి ఆ మేనేజర్ సరదాగా గడిపింది. అంతా కలిసి మద్యం కూడా సేవించారు. పార్టీ ముగిసిన తర్వాత, కారులో ఇంటి దగ్గర వదిలిపెడతామంటూ తీసుకెళ్లి, కారులోనే ఊహించని దారుణానికి ఒడిగట్టారు. మత్తులో ఉన్న ఆ మహిళా మేనేజర్‌పై అత్యాచారానికి తెగబడ్డారు. మగవాళ్లు ఇద్దరూ అత్యాచారం చేయగా, ఉమెన్స్ ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా ఉన్న మహిళ, బాధితురాలిని పట్టుకుంది. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 20న (Udaipur Incident) జరిగింది.
ఓ ప్రైవేటు ఐటీ కంపెనీకి చెందిన మహిళా మేనేజర్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. కంపెనీ సీఈవో, ఉమెన్ ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త ముగ్గుర్ని నిందితులుగా గుర్తించారు. వారి ముగ్గుర్ని బుధవారం నాడు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా, నాలుగు రోజులపాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కదులుతున్న కారులో ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు.
కారు ఆపి మత్తుమందు కొనుగోలు
బాధిత మహిళను కారులో తీసుకెళుతున్న సమయంలో నిందితులు మధ్యలో ఒకచోట ఆపారు. అక్కడ అచ్చం సిగరెట్లను పోలిన పదార్థాలు ఏవో కొన్నారు. వాటిలో ఒకదాన్ని బాధితురాలికి ఇచ్చారు. అది సేవించిన తర్వాత బాధితురాలు మత్తులోకి జారుకుంది. అయితే, మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని గుర్తించింది. తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కాగా, బాధితురాలు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో బర్త్ డే పార్టీకి హాజరైంది. కంపెనీకి చెందిన ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి హాజరయ్యారు. అందరూ మద్యం తాగారు. బాధితురాలు కూడా తాగింది. సుమారుగా రాత్రి 1.30 గంటల సమయంలో బాధితురాలు మద్యం మత్తుతో ఇబ్బందికి గురైంది. దీంతో, ఇంటి దగ్గర దించుతామంటూ సీఈవో జితేష్ ప్రకాశ్ సిసోడియా, ఉమెన్ ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త గౌరవ్ సిరోహి అడిగారు. కారులో బాధితురాలిని ఉమెన్ ఎగ్జిక్యూటివ్ పట్టుకొని కూర్చుంది. బాధితురాలు మరింత మత్తులోకి జారుకున్న తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశామని పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షలు కూడా జరిపామని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కారు నుంచి ఆధారాలు సేకరిస్తున్నామని వివరించారు. కాగా, నిందితుల్లో ఒకరైన సిసోడియా.. జీకేఎం ఐటీ కంపెనీకి సీఈవోగా ఉన్నాడు. ఈ కంపెనీ ఉదయ్‌పూర్‌లోని శోభాగ్‌పూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ నిందితుడు ఉదయ్‌పూర్‌లోనే అత్యంత విలాసవంతమైన, అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్ ‘స్కౌ మరీనా’లో నివసిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివసిస్తున్నట్టు వెల్లడించారు.
Read Also- Man Married Thrice: కంత్రి భర్త.. మూడేళ్లలో ముగ్గురిని పెళ్లాడాడు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్యలు

