Medak Church: కరువులో పేదల ఆకలి తీర్చి.. ఆసియాలోనే
Medak Church (image creidit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Medak Church: కరువులో పేదల ఆకలి తీర్చి.. ఆసియాలోనే ద్వితీయ స్థానం.. మెదక్ చర్చిపై స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం!

Medak Church: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కెథడ్రల్ చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. ఈ మహా దేవాలయం తీవ్ర కరువులో ఆకలి దప్పులు తీర్చి వందేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది మెదక్ సి ఎస్ ఐ చర్చ. ఆసియా ఖండం లోనే రెండో అతి పెద్ద చర్చిగా పేరొందిన సుందర మందిరం దేశ, విదేశీయులను ఆకట్టుకుంటూ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇంతటి ఖ్యాతి కలిగిన మహదేవాలయం పరమత సహనానికి, చారిత్రాత్మక వారసత్వ సంపదకు నెలవైన కులమత భేదాలు లేకుండా నిస్వార్థ సేవలందిస్తుంది. మెతుకుసీమకు మణిహరంగా భాసిల్లుతున్న మెదక్ కేథడ్రల్ చర్చి నేడు జరుగనున్న క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన 100 సంవత్సరాల ఉత్సవాల్లో మెదక్ చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. చర్చి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారు.నేటికి చర్చిని నిర్మించి 101 సంవత్సరాల చేరుకుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని

స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం

ప్రపంచంలోనే వాటికన్ తర్వాత రెండో అతి పెద్ద ఎత్తైన ఆలయంగా మెదక్ పట్టణంలోని కేథడ్రల్ చర్చి గుర్తింపు పొందింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటూ ఆసియా ఖండంలోనే ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. 1908 లో మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఎంతో మంది ప్రజలు సమిధలయ్యారు. ఉపాధి దొరక్క, బుక్కెడు బువ్వ లేక, అంటురోగాలు, ఆకలి చావులతో బతుకుదెరువు కష్టమై తీవ్ర కరువుతో ప్రజలు అల్లాడిపోయారు. అదే సమయంలో ఇండియాకు వచ్చిన ఇంగ్లాండ్ దేశస్థుడైన చార్లెస్ వాకర్ పాస్నెట్ ఇక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. ఏసు క్రీస్తు ప్రభువు పేరిట చర్చి నిర్మాణం చేపట్టి ప్రజలకు ఉపాధి కల్పించి ఆకలి తీర్చాలని ఆలోచించారు. ఈ విషయాన్ని అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దృష్టికి తీసుకెళ్లాడు. 1914లో పనికి ఆహార పథకం కింద చర్చి నిర్మాణానికి అంకురార్పణ చేశారు.

Also Read: Medak Police: మీ మొబైల్ పోయిందా? ఆందోళన చెందవద్దు.. అయితే ఇలా చేయండి : జిల్లా ఎస్పీ

ప్రజలకు కరువులో ఉపాధి కల్పించి ఆకలి దప్పిక

1914 నుంచి 1924 వరకు సుమారు పదేళ్ల పాటు చర్చి నిర్మాణాన్ని చేపట్టి వేల సంఖ్యలో ప్రజలకు కరువులో ఉపాధి కల్పించి ఆకలి దప్పిక తీర్చారు. అప్పటివరకు గుల్షనబాద్ గా ఉన్న ఈ ప్రాంతానికి చర్చి నిర్మాణంతో మెతుకు అని పేరు గాంచింది. ఆ తర్వాత కాలక్రమేణా మెదక్ గా రూపాంతరం చెందింది. ప్రతీ  ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి 10 నుంచి 1 గంటల వరకు రెండు ఆరాధనలు నిర్వహిస్తారు. క్రిస్మస్, ఈస్టర్ పండుగ వేళల్లో ఉదయం 4:30 నుంచి 7 గంటల వరకు తిరిగి 10 గంటల నుంచి మధ్యానం 2 గంటల వరకు ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. గుడ్ ఫ్రైడే రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10: 30 గంటల నుంచి అర్ధరాత్రి 1:30 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మరుసటి రోజున కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆరాధనల్లో పాల్గొంటారు.

పరమత సహనానికి చిహ్నం

పరమత సహనానికి, చారిత్రాత్మక వారసత్వ సంపదకు నెలవైన మెదక్ కేథడ్రల్ చర్చి కులమత భేదాలు లేకుండా నిస్వార్థ సేవలందిస్తుంది. 1924 తర్వత ప్రార్థనా మందిరంగా ఉన్న మెదక్ చర్చి 1947లో చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ)గా ఆవిర్భవించి డయాసిస్ కేంద్రంగా మారింది. ఆ తర్వాత బిషప్ ను నియమించడంతో కేథడ్రల్ మారగా, దీని పరిధిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు కలిశాయి..తెలంగాణ రాష్ట్రం అవిర్బావం తరువాత 13 జిల్లాల పరిధిలో విస్తరించింది.
ఆయా జిల్లాల్లోని కేథడ్రల్ పరిధిలో మిషన్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వసతిగృహాలు, వృద్ధాశ్రమాలను, ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతంగా లక్షల సంఖ్యలో సేవలందించారు. మిషన్ ఆసుపత్రులు వ్యాధుల బారిన పడిన, ప్రసవానికి ఉన్న వేల మంది ప్రాణాలు కాపాడి ఉచిత వైద్య సేవలను అందించాయి. అలాగే విద్యాసంస్థల్లో విద్యా బోధన అందించి లక్షల మందిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. వృద్ధాశ్రమంలో అనాథలను అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పించి ఆకలి తీరుస్తున్నారు.

Also Read: Medak District: బలవంతంగా భూసేకరణ.. కన్నెర్ర చేసిన రైతులు.. అధికారులను బంధించి..!

ఐరోపా గోతిక్ శైలిలో చర్చి నిర్మాణం

మెదక్ మహా దేవాలయం వందేళ్లు పూర్తి చేసుకున్నా చెక్కు చెదరకుండా ఉండటం అప్పటి కళా నైపుణ్యానికి నిదర్శనం. వాకర్ పాస్నేట్ చర్చి నిర్మాణానికి సుమారు 200 నమూనాలు తయారు చేయగా ఐరోపా గోతిక్ శైలిలో రూ. 14 లక్షల ఖర్చుతో నిర్మాణాన్ని చేపట్టారు.180 అడుగుల ఎత్తుతో చర్చిని నిర్మించాలని ఫాదర్‌ ఫాస్నెట్‌ తలంచి అనుమతి కోసం నిజాం ప్రభువుకు దరఖాస్తు సమర్పించారు. అయితే నిజాం రాజు చిహ్నంగా ఉన్న హైదరాబాద్‌లోని చార్మినార్‌ ఎత్తు 175 అడుగులు కాగా, అంతకంటే ఎక్కువ ఎత్తులో చర్చి నిర్మించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో చర్చి ప్రధాన గోపురం ఎత్తు 175 అడుగులు, వెడల్పు 100 అడుగులు, పొడువు 200 అడుగులు ఉంది. మెదక్‌ చర్చిని పూర్తిగా తెల్ల రాతి, డంగు సున్నం వినియోగించి రెండంతస్తుల్లో ఒకేసారి 5 వేల మంది భక్తులు కూర్చునే విధంగా నిర్మించారు.

మెదక్ చర్చి ప్రాముఖ్యతలు

చర్చి ప్రధాన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించే క్రమంలో కనిపించే మెట్లు, దిమ్మెలు, స్తంభాలకు ఒక్కో అర్థం ఉంది. చర్చి ఆరంభంలోని ప్రధాన ద్వారం పరమత సహనానికి ప్రతీకగా నిలుస్తోంది. నిర్మాణ సమయంలో సికింద్రాబాద్‌లోని దీర్జీ కంపెనీ మెదర్స్‌ను ప్రధాన ద్వార నిర్మాణం కోసం ఫాస్నెట్‌ సంప్రదించడం జరిగింది. హిందువులు అయిన కంపెనీ నిర్మాహకులు చర్చి ప్రత్యేకతను తెలుసుకొని టిల్లర్‌ వాహనంలో మెదక్‌ చేరుకొని తమకు సేవ చేసే అవకాశం కల్పించాలని వేడుకున్నారు. ప్రధాన ద్వారం నిర్మాణానికి రూ. 6,700 చేయూతనిచ్చి నిర్మిచారు.

మూడు మెట్లు:

ప్రధాన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించగానే దర్శనమిచ్చే మూడు మెట్లను బైబిల్‌లోని నంబర్ల ఆధారంగా తండ్రీ, కుమారా, పరిశుద్దాత్మగా భావిస్తూ కట్టారు.

10 మెట్లు..10 ఆజ్ఞలు:

మూడు మెట్ల తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే పది మెట్లు దర్శనమిస్తాయి. మోషే ధర్మ శాస్త్రం పొందేటప్పుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని, యెహోవాను వ్యర్థంగా ఉచ్చరించకూడదని, పరిశుద్ధాత్మతో ఉచ్చరించాలని, ఆదివారం పరిశుద్ధ దినంగా ఆచరించాలనేటు వంటి పది ఆజ్ఞలను గుర్తు చేస్తూ ఈ పది మెట్లను కట్టారు.

14 మెట్లు.. 14 తరాలు:

పవిత్ర బైబిల్‌ గ్రంథంలోని మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో అబ్రహము నుంచి ఏసు ప్రభువు పుట్టుక వరకు ఉన్న 14 తరాలను గుర్తు చేసేలా ఎడమవైపు 14 మెట్లను నిర్మించారు.

చర్చిలో 3 భాగాలు :

చర్చిని మూడు భాగాలుగా నిర్మాణం చేశారు. ఇందులో ఆరు వేల మంది భక్తులు ఒకేసారి కూర్చొని ప్రార్థనలు చేసేందుకు వీలుగా విశాలమైన హాల్ నిర్మించారు. రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం.

7 మెట్లు.. 7 వ్యాక్యాలు:

పరిశుద్ధ స్థలంలో పాస్టర్లు, బిషప్‌లు ఉంటారు. ఈ స్థలం వద్ద ఏడు మెట్లు ఉన్నాయి. వివాహ సమయంలో వధూవరులు 7 మెట్ల ఎక్కాల్సి ఉంటుంది. మెట్టు మెట్టుకొకటి చొప్పున ఏడింటికి ఏడు వ్యాక్యాలు ఉచ్చరిస్తారు. వివాహ బంధం, అన్యోన్య దాంపత్యం సాగించేలా ఫాస్టర్‌ బోధనలు చేస్తారు.

2 మెట్లు.. 2 పదార్థాలు:

అతిపరిశుద్ధ స్థలంలో రెండు మెట్లు ఉంటాయి. ఇక్కడ పాస్టర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ స్థలం నుంచి పాస్టర్లు భక్తులను ఆశీర్వదిస్తారు. ఆరాధన తర్వాత ప్రభురాత్రి భోజనంలో భక్తులకు రొట్టె, ద్రాక్షరసం ఇస్తారు. ఏసు ప్రభువును సిలువ వేసిన సందర్భంలో ఆయన శరీరాన్ని రొట్టెగా, కారిన రక్తానికి సూచికగా ద్రాక్షరసాన్ని సేవిస్తారు.

చర్చిలోకి ఐదు ప్రధాన ద్వారాలు:

చర్చి లోపలకు, వెలుపలకు వెళ్లేందుకు వీలుగా పంచద్వారాలు ఏర్పాటు చేశారు. యూదా దేశ నాయకుడు రాసిన ఆది, నిర్గమ, లేవి, సంఖ్యా, ద్వితీయోపదేశ కాండాలకు గుర్తుగా ఐదు ప్రధాన ద్వారాలను నిర్మించారు. ప్రధాన ద్వారానికి ఇరు పక్కల రెండేసి చొప్పున ద్వారాలు ఉంటాయి. తూర్పు నుంచి పురుషులు, పడమర నుంచి స్త్రీలు చర్చి లోపలకు వెళ్లేందుకు రెండు ద్వారాలు ఉన్నాయి.

40 స్తంభాలు.. 40 రోజల ఉపవాసాలు:

40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా చర్చి లోపలి భాగంలో 40 స్తంభాలను ఏర్పాటు చేశారు. పై కప్పు భాగంలో ఎక్కడ చూసినా సిలువ ఆకారంలో కనిపించడం ఆలయ ప్రత్యేకత.

66 దిమ్మెలు.. 66 గ్రంథాలు:

బైబిల్‌లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు ప్రతీకగా నిలుస్తున్నాయి. చర్చి ప్రధాన ద్వారంలోకి ప్రవేశించగానే పది మెట్ల తర్వాత ఆలయం చుట్టూరా ఎడమ, కుడి వైపున
66 చొప్పున విద్యుత్‌ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి.

12 మెట్లు.. 12 మంది శిష్యులు:

ఏసు ప్రభువు 12 మంది శిష్యులకు గుర్తుగా 12 మెట్లను నిర్మించారు.

అద్దాల కిటికీల్లో అపురూప దృశ్యాలు:

చర్చి లోపల భాగంలో ఉన్న మూడు గాజు కిటికీలు ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాంక్‌ ఓ సాలిజ్బరీ రూపొందించాడు. చర్చి లోపల ఉత్తరం, తూర్పు, పడమర వైపు ఒక్కోటి చొప్పున నిర్మించారు. ఈ కిటికీల పై సూర్యకిరణాలు పడితేనే అపూరూప దృశ్యాలు కనపడతాయి. తెల్లవారుజామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. ఉత్తరం వైపు సూర్య కిరణాలు పడే అవకాశం లేకున్నా తూర్పు, పడమర వైపు నుంచి వచ్చే కాంతి కింద వేసిన బండల పై వక్రీభవనం చెంది ఉత్తరం వైపునకు ప్రసరించడంతో దృశ్యాలు కనిపిస్తాయి. ఒక్కో కిటికీలోని దృశ్యానికి ఒక్కో చరిత ఉంది.

తూర్పు కిటికీలో ఏసు జన్మ వృత్తాంతం:

తూర్పు వైపు ఉన్న కిటికీ అద్ధాల్లో ఏసు క్రీస్తు జన్మ వృత్తాంతం తెలియజేసేలా 1947లో అమర్చారు. కిటికీ కింది భాగంలో ఏసుప్రభువు తల్లి మరియ, తండ్రి యేసేపు, తొట్టెల్లో బాల యేసు, ఎడమ వైపు గొల్ల వాళ్లు, మధ్యలో గాబ్రియల్, లోక రక్షకులు, కుడివైపు జ్ఞానులు ఉంటారు. పైభాగంలో ఏసు ప్రభువుకు ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్ద మనిషి చిత్రాలు కనిపిస్తాయి. ఏసు పుట్టక ముందు 700 ఏళ్ల క్రితం ఏసు ప్రభువు జన్మిస్తాడని యేషయా అనే ప్రవక్త తాను రాసిన గ్రంథంలో ప్రస్తావించాడు. ఆయన గుర్తుగా కిటికీలో పెద్ద మనిషిని పెట్టినట్లు ప్రతీతి. సూర్యకిరణాలు పడితేనే ఈ చిత్రాలు ప్రకాశవంతంగా దర్శనమిస్తాయి.

పడమర కిటికీలో సిలువ వృత్తాంతం:

ఏసును సిలువ వేసిన సందర్భాన్ని తెలియజేసేలా పడమర కిటికీలో 1958లో రూపొందించారు. ఏసు సిలువకు వేలాడుతున్న సమయంలో కింద కూర్చుని ఉన్న తల్లి మరియ, మీద చేయి పట్టుకుని నిలబడిన మగ్దలేని మరియ దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమ వైపు స్త్రీలతోపాటు ఏసు శిష్యుడు యోహాన్‌ పబ్బతి (దండం) పెడుతూ నిలబడి ఉంటాడు. ఏసు తన శిష్యుడు యోహాన్‌కు ఏడు మాటలు చెబుతున్న తీరును ఈ దృశ్యాలు కళ్లకు గట్టినట్లు కనిపిస్తాయి. కుడివైపు బల్లెంపట్టుకుని ఉన్న శతాధిపతి కనిపిస్తారు. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్‌ నెహ్రూ సూచన మేరకు హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌ మూడు భాషల్లో వ్యాఖ్యాలు పెట్టినట్లు మతపెద్దలు చెప్తున్నారు.

ఉత్తరం కిటికీలో ఈస్టర్‌ వృత్తాంతం:

ఏసు సిలువ వేసిన తర్వాత చనిపోయి మళ్లీ లేచి వచ్చి ఆరోహణ క్రమంలో పైకి వెళ్ళే సందర్భాన్ని ఈ కిటికీలోని దృశ్యాలు తెలియజేస్తాయి. ఉత్తరం వైపు ఉన్న కిటికీని 1927లో అమర్చారు. ఎడమ వైపు పిల్లలు, మధ్యలో పైకి వెళ్తున్న ఏసు, కింద భాగంలో ఆకుపచ్చ రంగు చీర ధరించిన భారతదేశ స్త్రీ చిత్రాలు ఇందులో కనిపిస్తాయి.

Also Read: Medak District: రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్.. ఎంతంటే..!

Just In

01

Ranga Reddy District: పట్టా భూములను కబ్జా చేస్తున్న బిల్డర్లు.. కోర్టు కేసులను లెక్కచేయకుండా బరితెగింపులు!

Singireddy Niranjan Reddy: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 27 వేల ఎకరాలు భూసేకరణ చేశాం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి!

AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AV Ranganath: పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి.. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!