Russian Envoy: భారత వ్యతిరేకి, ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అతడి హత్య వెనుక భారత్ కుట్ర ఉందంటూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అల్లర్లకు దిగారు. ఈ క్రమంలో ఓ హిందువుపై దాడి.. బహిరంగంగా తగలబెట్టారు. భారత్ వ్యతిరేక ధోరణి.. బంగ్లాలో అంతకంతకూ విస్తరిస్తున్న క్రమంలో మిత్ర దేశం రష్యా స్పందించింది. భారత్ తో ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా తగ్గించుకోవాలని బంగ్లాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
రష్యా ఏమన్నదంటే?
భారత్ తో ఉన్న ఉద్రిక్తతలను చల్లార్చుకోవడం దక్షిణాసియా ప్రాంతీయ స్థిరత్వానికి అవసరమని బంగ్లాదేశ్ లోని రష్యా రాయబరి అలెగ్జాండర్ గ్రిగోర్వెవిచ్ ఖోజిన్ (Alexander Grigoryevich Khozin) స్పష్టం చేశారు. ఎంత త్వరగా అది చేస్తే అంత మంచిదని హెచ్చరించారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం సాధించడంలో భారతదేశం పోషించిన కీలక పాత్ర గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘బంగ్లాదేశ్ స్వాతంత్రం సాధించడంలో భారత్ ముఖ్య భూమిక పోషించింది. ఆ సమయంలో రష్యా కూడా ఇందుకు మద్దతు ఇచ్చింది. భారత్, రష్యా, బంగ్లాదేశ్ కలిసి పనిచేశాయి’ ఖోజిన్ పేర్కొన్నాయి.
‘మీకిది మంచిది కాదు’
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉన్న స్థాయికి మించి ఉద్రిక్తతలు పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రష్యా రాయబారి సూచించారు. ఫిబ్రవరి 12న బంగ్లాలో జాతీయ ఎన్నికల జరగనున్న వేళ.. రాజకీయ అనిశ్ఛితి, మైనారిటీలపై హింస, మూకుమ్మడి దాడులు మంచిదికాదని ఆయన హితవు పలికారు. అయితే తమ దేశం.. భారత్ – బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోవడంలేదని రష్యా ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే ఉద్రిక్తతలు మరింత పెరగకుండా మార్గం కనుగొనాలని మాత్రమే బంగ్లాదేశ్ కు సూచిస్తోందని చెప్పారు.
Also Read: Poco M8 Series: పోకో అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి రానున్న పోకో M8 సిరీస్
బంగ్లాదేశ్‌లో అశాంతి
గత వారం విద్యార్థి నాయకుడు షరీఫ్ ఒస్మాన్ హాది మృతి చెందడంతో బంగ్లాదేశ్‌లో మరోసారి అశాంతి చెలరేగింది. షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో హాది ప్రముఖ పాత్ర పోషించారు. గత ఏడాది హసీనాను తొలగించిన తర్వాత ఏర్పడిన హాదీ నేతృత్వంలో ‘ఇంకిలాబ్ మోంచో’ గ్రూపు ఏర్పడింది. ఇది హసీనా, భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లో నిరసనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. అతడ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడంతో ఆ నెపాన్ని భారత్ పైకి తోసే కుట్రను బంగ్లాదేశ్ చేస్తోంది. ఈ క్రమంలోని చిట్టగాంగ్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి కూడా చేశారు.

