Deepu Chandra Das: రెండు రోజులక్రితం బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన దీపు చంద్ర దాస్ (Deepu Chandra Das) అనే వ్యక్తిపై మూకదాడి జరగడం, అతడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ హత్యోదంతానికి సంబంధించిన సంచలన విషయాలు తాజాగా వెలుగుచూశాయి. దీపు చంద్రదాస్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం ఈ దారుణానికి దారితీసింది. ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు.
దైవదూషణకు పాల్పడ్డాడంటూ ముస్లిం నిరసనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడి, దీపు చంద్ర దాస్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లారు. అతడిని అప్పగించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆ ప్రాంతాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో, ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ అనాలోచితంగా వ్యవహరించింది. దీప్ చంద్రదాస్‌తో అప్పటికప్పుడు బలవంతంగా ఉద్యోగానికి రాజీనామా చేయించి, అతడిని తీసుకెళ్లి, బయట ఎదురుచూస్తున్న మూకకు అప్పగించింది. ఫ్యాక్టరీ సూపర్‌వైజర్లు అంతా కలిసి రిజైన్ చేయించారు. పనిచేస్తున్న ప్రదేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. అప్పటికే ఎదురుచూస్తున్న ముస్లిం నిరసనకారులు దీపు చంద్ర దాస్ చేతికి చిక్కిన వెంటనే పశువుల్లా ప్రవర్తించారు. దారుణాతి దారుణంగా కొట్టారు. దుస్తులన్నీ విప్పేసి ఉరితీశారు. వేలాడుతున్న డెడ్‌బాడీని కూడా తీవ్రంగా కొడుతూ రాక్షసానందం పొందారు. సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తూ సంతోషపడ్డారు. అనంతరం వేలాడుతున్న డెడ్‌బాడీకి నిప్పు అంటించారు.
సహచరులు సైతం..
దీపు చంద్ర దాస్ పనిచేసిన ఫ్యాక్టరీలోని అతడి సహచరులు కూడా అమానవీయంగా ప్రవర్తించారు. అనాగరిక హత్యలో వారు కూడా భాగమయ్యారు. మూకతో కలిసి వారు కూడా దాడికి పాల్పడ్డారు. దీపుచంద్ర దాస్ దైవదూషణకు పాల్పడినట్టుగా సరైన ఆధారాలు కూడా లేవని ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉన్న అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశామని, ఈ జాబితాలో ఫ్యాక్టరీ అధికారులు, వర్కర్లు కూడా ఉన్నారన్నారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన మొదలైందని, ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్‌ఛార్జీ బలవంతంగా దీపు చంద్ర దాస్‌తో ఉద్యోగానికి రిజైన్ చేయించాడని పోలీసులు తెలిపారు. అందుకే, పోలీసులకు సమాచారం అందించి అతడిని రక్షించాల్సిందిబోయి, నిరసనకారులను అప్పగించడంతో అరెస్ట్ చేశామని నైముల్ హాసన్ అనే ఓ అధికారి వెల్లడించారు. ఫ్యాక్టరీలో షిప్టులు మారే సమయం కావడం, అప్పటికే నిరసనకారులు ఉండడంతో ఫ్యాక్టరీ ముందు ఎక్కువమంది జనాలు పోగయ్యారని పేర్కొన్నారు. సంబంధిత వార్తలు విస్తృతంగా ప్రసారం కావడంతో స్థానికులు కూడా ఘటనా స్థలానికి వెళ్లారని, దాదాపు 8.45 గంటల సమయంలో ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ దీపు చంద్రదాస్‌ను సెక్యూరిటీ రూమ్ నుంచి నిరసనకారులకు అప్పగించినట్టు తేలిందన్నారు. మూకదాడికి పాల్పడినవారిలో అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాస్ సహచరులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, దీపు చంద్ర దాస్‌కు మూడేళ్లక్రితమే పెళ్లి అయ్యింది. ఏడాదిన్నర వయసున్న బిడ్డ ఒకరు ఉన్నారు.
Read Also- VC Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. స్వయంగా ప్రశ్నించనున్న సీపీ సజ్జనార్!

