Suryakumar Yadav: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా అద్భుత రీతిలో గెలుచుకుంది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారధ్యంలోనే సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకున్నప్పటికీ, టీ20 వరల్డ్ కప్‌నకు మరో నెలన్నర రోజుల ముందు టీమిండియాను ప్రధానంగా రెండు సమస్యలు వేధిస్తున్నాయి. ఒకటి, సారధిగా ఉన్న సూర్య అత్యంత పేలవంగా ఆడుతుండడం, రెండవది, ఏమాత్రం రాణించలేకపోతున్నా శుభ్‌మన్ గిల్ కోసం యశస్వి జైస్వాల్‌ను పక్కన పెడుతుండడం. ఈ లోపాల మధ్య బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం (డిసెంబర్ 20) టీ20 వరల్డ్ కప్-2026కు భారత జట్టుని ప్రకటించనుంది. వరల్డ్ కప్‌కు కేవలం మరో నెలన్నర రోజుల సమయం మాత్రమే ఉండడంతో జట్టులో ఇప్పుడేమీ అనూహ్య మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌నే కొనసాగించడం ఖాయం. అయితే, వరల్డ్ కప్ తర్వాత మాత్రం ఆ పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యను పక్కన పెట్టే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కేవలం కెప్టెన్ కావడంతోనే చోటు
సూర్యకుమార్ యాదవ్ అత్యంత దారుణంగా విఫలమవుతున్నాయి. గత 14 నెలల కాలంలో అతడు మొత్తం 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడుతున్నాడు. క్రీజులోకి రావడం, ఔటయ్యి వెళ్లిపోవడం అన్నట్టుగా పరిస్థితి ఉంది. అయినప్పటికీ జట్టులో అతడికి చోటు దక్కుతుందంటే అందుకు కారణం, అతడు కెప్టెన్‌గా ఉండడమేనని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కెప్టెన్ అయిన తర్వాత సగటు 15 రన్స్ కంటే తక్కువగా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దారుణంగా విఫలమవుతున్నా కెప్టెన్సీలో ఇంకా కొనసాగించడం ఏంటని అభిమానులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఒకప్పుడు ‘మిస్టర్ 360’.. ఇప్పుడేమో ఇలా
సూర్యకుమార్ యాదవ్ ఎంత అలవోకగా సిక్సర్లు కొట్టగలడో అందరికీ తెలిసిందే. అందుకే, టీ20 క్రికెట్‌లో ఒకప్పుడు మిస్టర్ 360గా విశ్లేషకులు అభివర్ణించేవారు. ఈ క్రమంలోనే భారత టీ20 కెప్టెన్ కూడా అయ్యాడు. కానీ, సారధిగా బాధ్యతలు స్వీకరించాక గడ్డు కాలాన్ని చూస్తున్నాడు. 2025 సంవత్సరం సూర్యకు ఏమాత్రం కలిసిరావడం లేదని చెప్పవచ్చు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ వైఫల్యాల పరంపర కొనసాగింది. దీంతో, జట్టులో అతడి స్థానం, కెప్టెన్సీపై క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.
Read Also- Adwait Kumar Singh: వరదలు, పరిశ్రమ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్!
2025 క్యాలెండర్ ఏడాది సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. సగటు కేవలం 13.62 రన్స్‌గా, స్ట్రైక్ రేట్ 123.16గా ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 47 రన్స్‌గా ఉంది. అంటే, ఈ ఏడాది మొత్తం మీద కనీసం ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. ఒకప్పుడు 170కి పైగా స్ట్రైక్ రేట్ ఆడిన సూర్య ఇప్పుడు కనీస స్థాయిలో కూడా రాణించలేకపోతుండడం విమర్శల పాలవుతోంది.
సూర్య ఈ విధంగా విఫలమవుతుండడం, మరోవైపు, వైస్ కెప్టెన్‌గా ప్రమోట్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ కూడా వైఫల్యం చెందుతుండడం సెలక్టర్లకు తలనొప్పిగా మారిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు వీరిద్దరి ఫామ్ ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యువ ప్లేయర్లు అద్భుత ఫామ్‌లో ఉండటంతో జట్టు గెలుస్తుండడం, సూర్యకుమార్‌కు అండగా ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ, టీ20 వరల్డ్ కప్ జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. అయితే, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మాత్రం సూర్య కెప్టెన్సీపై వేటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవి ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.
Read Also- Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే

