Sewage Dumping Case: ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయంలో మురుగునీటిని పారబోశారంటూ సోషల్ మీడియా(Social Media)లో జరుగుతున్న ప్రచారంపై జలమండలి స్పష్టత ఇచ్చింది. హైదరాబాద్(Hyderabad) నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరైన గండిపేట జలాశయంలో అక్రమంగా మురుగునీటిని జలాశయంలోకి అక్రమంగా మురుగునీటిని పారబోయడానికి యత్నించిన ఒక ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకర్(Private septic tanker)ను అధికారులు పట్టుకున్నారని, దీనికి కారణమైన డ్రైవర్ రమావత్ శివ నాయక్(Shica Nayak) (33), యజమానిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో, హిమాయత్ నగర్ గ్రామం వద్ద ఉన్న ఎఫ్‌టీఎల్(FTL) పాయింట్ నంబర్ 428 వద్ద టీజీ 11-టీ1833 నెంబర్ గల సెప్టిక్ ట్యాంకర్ అక్రమంగా మురుగునీటిని జలాశయంలోకి పారబోసేందుకు యత్నించినట్లు, అంతలో అక్కడకు వచ్చిన పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల నుంచి తప్పించుకోవడానికి నిందితులు ట్యాంకర్‌పై నకిలీ జలమండలి లోగోను వాడారని, ఆ వాహనానికి బోర్డుతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
నీరు సురక్షితం.. నిరంతర నిఘా
జలాశయంలో మురుగునీరు కలవలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి(MD Ashock Reddy) భరోసా ఇచ్చారు. నగర ప్రజలకు సరఫరా అయ్యే తాగునీటిని ఆసిఫ్ నగర్, మీరాలం ఫిల్టర్ బెడ్ల వద్ద శుద్ధి చేస్తున్నామని, ప్రతి గంటకు నీటి నాణ్యతను పరీక్షిస్తున్నామని తెలిపారు. జలాశయాల చుట్టుపక్కల నుంచి వచ్చే సీవరేజ్ సమస్యను పరిష్కరించడానికి రెండు వైపులా ఎస్టీపీ(STP)లు నిర్మిస్తున్నామని, మరో ఆరు నెలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని వివరించారు. తాగునీటి వనరులను కలుషితం చేసే ఏ చర్యలనైనా బోర్డు సహించబోదని, అలంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెంచుతుమని ఈ సందర్బంగా అశోక్ రెడ్డి తెలిపారు.ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు.
Also Read: Ramchander Rao: పైడిపల్లెలో రీకౌంట్ చేయాలి.. లెక్కింపులో తప్పిదాలు జరిగాయి : రాంచందర్ రావు
మూడంచెల శుద్ధి ప్రక్రియ
ప్రజలకు అందుతున్న నీటిలో ఐఎస్ ప్రమాణాల ప్రకారం 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎండీ తెలిపారు. జలమండలి ఇప్పటికే మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవలంబిస్తోందని, నీరు పూర్తిగా శాస్త్రీయంగా శుద్ధి చేయబడిన తర్వాతే సరఫరా అవుతుందని పేర్కొన్నారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాల వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. నగర ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్ – 10500-2012) ప్రమాణాల్ని పాటిస్తూ శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటామని చెప్పారు. తాగునీటి వనరులను కలుషితం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా వ్యర్థాలను పారబోస్తున్నట్లు గుర్తిస్తే 155313 కస్టమర్ కేర్ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
Also Read: Sigma Movie Update: సందీప్ కిషన్ ‘సిగ్మా’ షూటింగ్ పూర్తి.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే?

