Thummala Nageswara Rao: వ్యవసాయ శాఖ, అనుబంధ కార్పొరేషన్ల కార్యాలయాల్లో పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. డివిజన్ స్థాయి ఉద్యోగుల వరకు అందరూ సమయపాలన పాటించేలా బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇటీవల పలు హెచ్ఓడీ కార్యాలయాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో, ఉద్యోగులు విధులకు ఆలస్యంగా వస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్‌ను మంత్రి ఆదేశించారు.
Also Read: Thummala Nageswara Rao: యూరియా తగ్గింపుపై దృష్టి పెట్టండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు!
ఎలాంటి జాప్యం జరగకూడదు
ప్రజా పాలనలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదని తుమ్మల స్పష్టం చేశారు. కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల మొత్తం విభాగానికి చెడ్డపేరు వస్తోందని, ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే లేదా ఆలస్యంగా వచ్చే వారిపై తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టులను ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను కోరారు.
ఆన్‌లైన్ డాష్ బోర్డులను ఏర్పాటు చేయాలి
ఉద్యోగుల హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి కార్యాలయంలో ఆన్‌లైన్ డాష్ బోర్డులను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఐటీ విభాగం సమన్వయంతో ఈ డాష్ బోర్డులు పనిచేస్తాయని, దీనివల్ల ఉన్నతాధికారులు విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను నేరుగా చూడవచ్చని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి వెల్లడించారు.
Also Read: Thummala Nageswara Rao: యూరియా కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

