North Carolina Tragedy : అమెరికా నార్త్ కరోలైనా రాష్ట్రంలోని స్టేట్స్‌విల్లే ప్రాంతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. చిన్న జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయిన ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో మాజీ నాస్కార్ (NASCAR) రేసింగ్ డ్రైవర్ గ్రెగ్ బిఫుల్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు వార్తా సంస్థ వెల్లడించింది.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెల్లడించిన వివరాల ప్రకారం, సెస్నా C550 జెట్ విమానం గురువారం ఉదయం సుమారు 10:20 (ఈస్టర్న్ టైమ్) సమయంలో స్టేట్స్‌విల్లే విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. విమానం కూలిన వెంటనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్ అవేర్’ సమాచారం మేరకు, ఈ విమానం ఉదయం 10 గంటల తర్వాత విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినప్పటికీ, కొద్దిసేపటికే తిరిగి వచ్చి ల్యాండింగ్ ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాద ఘటనపై స్పందించిన స్టేట్స్‌విల్లే సిటీ మేనేజర్ రాన్ స్మిత్ మాట్లాడుతూ, “ ఇది ఇంకా కొనసాగుతున్న ఘటన. అనేక శాఖలు కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది” అని తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ రెస్పాండర్స్ రన్‌వేపైకి చేరుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. విమానం శిథిలాలు రన్‌వేపై చెల్లాచెదురుగా పడి, మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు విషాధకరంగా కనిపించాయి.
స్టేట్స్‌విల్లే ప్రాంతీయ విమానాశ్రయ మేనేజర్ జాన్ ఫెర్గుసన్ మాట్లాడుతూ, ప్రమాద స్థలాన్ని ఎఫ్‌ఏఏ స్వాధీనం చేసుకుందని తెలిపారు. “రన్‌వేపై ఉన్న శిథిలాలను తొలగించి, విమానాశ్రయాన్ని సురక్షితంగా మార్చడానికి కొంత సమయం పడుతుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నాం” అని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంపై ఎఫ్‌ఏఏతో పాటు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

