Nidhhi Agarwal: లూలూ మాల్‌లో జరిగిన ‘ది రాజా సాబ్’ చిత్ర ప్రమోషన్ ఈవెంట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నటి నిధి అగర్వాల్‌కు అభిమానుల నుంచి ఎదురైన చేదు అనుభవం అక్కడ చోటుచేసుకున్న అస్తవ్యస్త పరిస్థితులపై కేపీహెచ్‌బీ (KPHB) పోలీసులు కఠినంగా స్పందించారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాలోని సాంగ్ లాంచ్ కార్యక్రమానికి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె వస్తున్నారన్న సమాచారంతో మాల్‌లోని అన్ని అంతస్తులు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. నిధి మాల్‌లోకి ప్రవేశించగానే జనం ఒక్కసారిగా ఆమె వైపు దూసుకొచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, వేలాది మందిని నియంత్రించడం వారి వల్ల కాలేదు. ఇప్పటికే ఇదే విషయంపై నటి నిథి అగర్వాల్ తన సోషల్ మీడియా వేదికగా అక్కడి ఘటనపై ఫైర్ అయ్యారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. అభిమానులు ఆమెతో సెల్ఫీల కోసం ఎగబడటంతో నిధి అగర్వాల్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. గుంపు మధ్య చిక్కుకుపోయిన ఆమె కనీసం ఊపిరి తీసుకోలేని స్థితిలో కనిపించారు. అభిమానులు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకుండా చుట్టుముట్టడం, తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. అతికష్టం మీద సెక్యూరిటీ ఆమెను కారు వరకు చేర్చగలిగారు.
అనుమతి లేదు.. బాధ్యత లేదు
ఈ మొత్తం వ్యవహారంపై కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించే ముందు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. “ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వాహకులు ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. భారీ ఎత్తున జనసమీకరణ జరుగుతుందని తెలిసి కూడా సరైన భద్రతా చర్యలు చేపట్టడంలో లూలూ మాల్ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లు విఫలమయ్యారు. అందుకే వారిపై కేసు నమోదు చేశాం,” అని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.
Read also-Ravi Teja: రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే?
విచారణ..
పోలీసులు ప్రస్తుతం కొన్ని అంశాలపై దృష్టి సారించారు. భద్రతా లోపాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. మాల్ లోపల మరియు బయట తగినంత మంది సెక్యూరిటీ గార్డులు లేరు. కనీసం పోలీసులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. వేలాది మందిని ఆహ్వానించారు. సినిమా ప్రమోషన్ల పేరుతో సెలబ్రిటీల ప్రాణాలకు, ప్రజా భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అవసరమని పోలీసులు భావిస్తున్నారు.

