Christmas Dinner: హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియం (LB Stadium)లో క్రిస్మస్ డిన్నర్ ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) నిర్ణయించింది. ఇందులో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ (Minister Azharuddin).. ఉన్నాతాధికారులు, వివిధ శాఖల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తారని మంత్రి స్ఫష్టం చేశారు. డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులకు ఈ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నట్లు అజారుద్దీన్ స్పష్టం చేశారు.
ఎల్‌బీ స్టేడియంలో జరగబోయే ఈ డిన్నర్ కార్యక్రమానికి సుమారు 10,000 మంది క్రైస్తవులు హాజరవుతారని మంత్రి అజారుద్దీన్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు గురువారం (డిసెంబర్ 18) ఎల్‌బీ స్టేడియాన్ని అధికారులు తనిఖీ చేయనున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం లౌకిక దృక్పథానికి, సీఎం రేవంత్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని చేప్పేందుకు ఈ కార్యక్రమం ఒక ఉదారహణగా నిలుస్తుందని అజారుద్దీన్ అభిప్రాయపడ్డారు.
Also Read: Viral Video: పెళ్లి కూతురు కోసం వచ్చి.. బొక్కబోర్లా పడ్డ ఫొటోగ్రాఫర్.. నవ్వులే నవ్వులు!
క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన రోజు క్రిస్మస్ అని మంత్రి అజారుద్దీన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున నిర్వహించే క్రిస్మస్ డిన్నర్ ఏర్పాట్లలో ఎలాంటి అసౌకర్యం కలగడానికి వీల్లేదని పేర్కొన్నారు. తాగునీటి ఏర్పాటు, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్, జనసమూహ నియంత్రణకు సంబంధించి సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అజారుద్ధీన్ తెలిపారు. అంతేకాదు క్రిస్మస్ డిన్నర్ లో అందించే ఆహారం నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడవద్దని అధికారులకు సూచించినట్లు చెప్పారు.

