Maruti Suzuki: మారుతీ సుజుకి ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన వ్యాగన్ ఆర్ మరో అరుదైన మైలురాయిని అందుకుందని అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో వ్యాగన్ ఆర్ కారు మొత్తం ఉత్పత్తి 35 లక్షల యూనిట్లను దాటింది. 1999 డిసెంబర్‌లో మొదటిసారిగా మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి మూడు తరాలుగా కొనసాగుతున్న ఈ మోడల్‌కు ఇది పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.
ఈ ఘనతతో వ్యాగన్ ఆర్, ఇప్పటికే 35 లక్షల ఉత్పత్తి మార్క్‌ను చేరుకున్న ఆల్టో, స్విఫ్ట్ మోడళ్ల పక్కన నిలిచింది. ప్రస్తుతం వ్యాగన్ ఆర్ ఉత్పత్తి హర్యానాలోని గుర్గావ్, మనేసర్ ప్లాంట్లలో కొనసాగుతోంది. కుటుంబ అవసరాలకు సరిపడే కారుగా ప్రారంభమైన వ్యాగన్ ఆర్, కాలక్రమంలో భారత వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించింది.
వ్యాగన్ ఆర్ తన ప్రయాణంలో ఎన్నో మార్పులు చూసింది. ప్రారంభంలో ప్రాక్టికాలిటీ, లోపలి ప్లేస్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచిన ఈ కారు, తర్వాత LPG, CNG వేరియంట్లు, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) వంటి ఆప్షన్లతో అప్‌డేట్ అయింది. మూడో తరం వ్యాగన్ ఆర్ 2019లో విడుదల కాగా, 2022లో వచ్చిన మోడల్ కి అప్‌డేట్ వచ్చింది.
ఇంజిన్ విషయానికి వస్తే, వ్యాగన్ ఆర్ లో రెండు K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. 1.0 లీటర్ ఇంజిన్ 67PS పవర్, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, 1.2 లీటర్ ఇంజిన్ 90PS పవర్, 113Nm టార్క్ ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్‌గా 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ ఇంజిన్‌తో CNG వేరియంట్ కూడా లభిస్తుంది.
భద్రత పరంగా తాజా వాగన్‌ఆర్ HEARTECT ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఇవ్వడం విశేషం. అలాగే ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఫీచర్లలో 7 అంగుళాల SmartPlay Studio టచ్‌స్క్రీన్, Apple CarPlay, Android Auto, బ్లూటూత్, వాయిస్ కమాండ్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
భారత్‌లో మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్ ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.6.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో ఇది టాటా టియాగోతో పోటీ పడుతోంది. SIAM గణాంకాల ప్రకారం, వాగన్‌ఆర్ గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలవడం, ఈ మోడల్‌కు ఉన్న ఆదరణకు నిదర్శనం.
అంతర్జాతీయంగా కూడా వ్యాగన్ ఆర్ మంచి గుర్తింపు ఉంది. 75కి పైగా దేశాల్లో అమ్ముడవుతున్న ఈ కారు, 2025 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి యూనిట్ల అమ్మకాలను దాటడం విశేషం. భారత మార్కెట్‌లోనే కాకుండా గ్లోబల్ స్థాయిలోనూ వ్యాగన్ ఆర్ తన సత్తా చాటుతూనే ఉంది.

