Murder Case: మామను హత్య చేశాడని పగబట్టి సహచరులతో కలిసి రౌడీషీటర్ ను చంపిన కేసులో పహాడీషరీఫ్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ మైనర్ బాలుడు ఉండటం గమనార్హం. కాగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణ రెడ్డి(DCP Narayana Reddy) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అత్తాపూర్ చింతల్ మెట్ ప్రాంత వాస్తవ్యుడు, రౌడీషీటర్ అయిన షేక్ ఆమెర్(Sheikh Amer) (32)ను నాలుగు రోజుల క్రితం దుండగులు పహాడీషరీఫ్ ప్రాంతంలో కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సీఐ రాఘవేందర్ రెడ్డి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, దయాకర్ రెడ్డి, లక్ష్మణ్, మహ్మద్ ఫైజల్ అహమద్ లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పటు చేసుకుని విచారణ ప్రారంభించారు.
ఓ మైనర్ బాలుడు అరెస్ట్..
హత్య జరిగిన చోట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. దీనిని విశ్లేషించటం ద్వారా హత్యకు పాల్పడ్డ బాలాపూర్ సందేశ్ నగర్ నివాసి అహమద్ ఎమాద్ మహ్మద్ (19)తోపాటు అతని సహచరులైన మీర్జా జాఫర్ బేగ్ (33), సయ్యద్ షా అబ్దుల్ జబ్బార్ (22), ఇబ్రహీం బిన్ సలీం బమర్ (22), అవైస్ బిన్ అబ్దుల్లా బరషీద్ (24), అఫ్పాన్ ఉల్లా ఖాన్ (19)తోపాటు ఓ మైనర్ బాలున్ని అరెస్ట్ చేశారు. విచారణలో ప్రధాన నిందితుడైన అవైస్ బిన్ అబ్దుల్లా బరషీద్ తన మేనమామ ముబారక్ సిగార్(Mubarak Cigar) ను హత్య చేశాడన్న కక్షతోనే షేక్ ఆమెర్ ను పక్కాగా పథకం రూపొందించి హతమార్చినట్టుగా వెల్లడైంది. రౌడీషీటర్ అయిన షేక్ ఆమెర్ బాలాపూర్ స్టేషన్ పరిధిలో మరో రౌడీషీటర్ అయిన ముబారక్ సిగార్ ను సహచరులతో కలిసి 2924లో హత్య చేశాడు. ప్రస్తుతం ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవలే వేర్వేరు కేసుల్లో నిందితునిగా ఉన్న షేక్ ఆమెర్ ను అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండరాదని తడీపార్ విధిస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
అతని కదలికలపై కన్నేసి..
దాంతో రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాకు వెళ్లి రెండు మూడు నెలలపాటు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్న షేక్ ఆమెర్ ఈనెల 13న బాలాపూర్ మండలం వాదే సలేహీన్ ప్రాంతంలో ఉంటున్న సోదరుడు షేక్ ఫరీద్ వద్దకు వెళ్లి అదే విషయం చెప్పాడు. డబ్బు సాయం చేయమని అడిగాడు. షేక్ ఫరీద్ డబ్బు సమకూరుస్తా అని చెప్పగా అక్కడి నుంచి స్నేహితులతో కలిసి బయల్దేరి పహాడీషరీఫ్ ప్రాంతానికి వచ్చాడు. అయితే, చాలా రోజులుగా అతని కదలికలపై కన్నేసి పెట్టిన బిన్ అబ్దుల్లా బరషీద్ ద్విచక్ర వాహనాలపై సహచరులతో కలిసి అక్కడికి వచ్చి షేక్ ఆమెర్ పై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ షేక్ ఆమెర్ అక్కడికక్కడే మరణించాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన కేసులో నాలుగు రోజుల్లోనే మిస్టరీని ఛేధించి ప్రధాన నిందితునితోపాటు అతని సహచరులను అరెస్ట్ చేసిన సిబ్బందిని డీసీపీ నారాయణ రెడ్డి అభినందించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
Also Read: IDPL Land Issue: రవీందర్ రావు బాగోతాన్ని మొత్తం బయటపెడతా: శ్రీకాంత్ గౌడ్

