IPL Auction Live Blog: ఐపీఎల్ వేలం 2026లో (IPL Auction 2026) ఆటగాళ్ల కోసం పోటీ మొదలైంది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఈ మినీ వేలంలో ఫ్రాంచైజీలు ప్లేయర్ల కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. జట్లకు ముఖ్యమైన ప్లేయర్ల అవసరం ఏర్పడడంతో పలువురు ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పరిణామం పలువురు విదేశీ ఆటగాళ్లకు బాగా కలిసొచ్చింది. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, శ్రీలంక ప్లేయర్లు వనిందు హసరం, మతీశ పతిరణల పంట పండింది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసింది?, తెలుగు ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎవరినీ కొనుగోలు చేసింది?, ఏయే ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు?.. ఆసక్తికరమైన అప్‌డేట్స్‌లో ఇక్కడ లైవ్‌గా (IPL Auction Live Blog) తెలుసుకోండి.
రూ.14.2 కోట్లు కొల్లగొట్టిన మరో యువ ప్లేయర్
వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన దేశవాళీ అన్‌క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మ అనూహ్య ధర పలికాడు. అతడి బేస్ ప్రైస్ కేవలం రూ.30 లక్షలు కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.14.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అతడి కోసం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీ పడింది. రూ.13.2 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ బిడ్ వేసింది. అయినప్పటికీ, చెన్నై మరో కోటి పెంచి రూ.14.20 కోట్లకు దక్కించుకుంది.
రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కి రూ.14.2 కోట్లు
ఐపీఎల్ వేలం-2026లో సంచలనం నమోదయింది. దేశవాళీ క్రికెటర్ ప్రశాంత్ వీర్ రికార్డ్ స్థాయి ధర పలికాడు. అతడి బేస్ ప్రైస్ కేవలం రూ.30 లక్షలు మాత్రమే కాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.14.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అతడి కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. సన్‌రైజర్స్ రూ.6.8 కోట్లకు బిడ్ వేసింది. అయినప్పటికీ చెన్నై వదులుకోలేదు. చివరకు రూ.14.2 కోట్లకు సీఎస్కే దక్కించుకుంది. దీంతో, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన భారతీయ క్రికెటర్‌గా ప్రశాంత్ వీర్ నిలిచాడు.
- బేస్ ప్రైస్ రూ.30 లక్షలు ఉన్న అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఔకిబ్ నబీ దార్‌పై రికార్డు స్థాయిలో రూ.8.4 కోట్లు కుమ్మరించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఈ దేశవాళీ ఆటగాడి కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అతడి బేస్ కేవలం రూ.30 లక్షలే అయినప్పటికీ, తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత ఆర్సీబీ రూ.1.10 కోట్లకు బిడ్ వేసింది. ఆ వెంటనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.2.2 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత తన బిడ్డింగ్‌ను రూ.7.40 కోట్లకు పెంచింది. అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ వెనక్కి తగ్గలేదు. చివరకు రూ.8.4 కోట్లతో ఔకిబ్ నబీ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కింది. దీంతో, ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన భారతీయ క్రికెటర్‌గా ఔకిద్ నిలిచాడు.
- న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫ్ఫీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
- బేస్ ప్రైస్ రూ.2 కోట్లకు డేవిడ్ మిల్లర్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- క్వింటన్ డి కాక్‌ను కేవలం రూ.1 కోటికి దక్కించుకున్న ముంబై ఇండియన్స్
- బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఫిన్ అలెన్‌ను రూ.2 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
- ఆసీస్ ప్లేయర్ కెమెరాన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
- శ్రీలంక ప్లేయర్ మతీశ పతిరణను రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్. బేస్ ప్రైస్ కేవలం రూ.2 కోట్లే అయినప్పటికీ, అతడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.
- రవి బిష్ణోయ్‌ని రూ.7.20 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లే, కానీ, ఫ్రాంచైజీలు బాగా పోటీ పడ్డాయి.
- గతేడాది ఏకంగా రూ.23 కోట్లు పలికిన ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను కేవలం రూ.7 కోట్లకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుంది.
- వెస్టిండీస్ ప్లేయర్ అకెల్ హోసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది.
- అన్రిచ్ నోర్టజేను లక్నో సూపర్ జెయింట్స్ రూ.2 కోట్లకు దక్కించుకుంది.
అమ్ముడుపోని ప్లేయర్లు వీళ్లే..
పలువురు స్టార్ క్రికెటర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఆ జాబితాలో సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, లియామ్ లివింగ్ స్టోన్‌తో పలువురు ఆటగాళ్లు ఉన్నారు. రాహుల్ చాహర్, మహీష్ తీక్షణ, ఆకాశ్ దీప్, శివమ్ మావి, గెరాల్డ్ కోయెట్జీ, స్పెన్సర్ జాన్సన్, రచిన్ రవీంద్ర, రెహముల్లా గుర్బాజ్, జానీ బెయిల్‌స్టో, జేమీ స్మిత్, కేఎస్ భరత్, జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్, డేవోన్ కాన్వే, గస్ ఆట్కిన్సన్, దీపక్ హుడా, మ్యాట్ హెన్రీ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

