Hyderabad Crime: హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లి ఏడేళ్ల కూతురిని బిల్డింగ్ పైనుంచి తోసి దారుణంగా హత్య చేసింది. వసంతపురి కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే సోమవారం మధ్యాహ్నం ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను హుటాహుటీనా గాంధీకి తరలించగా చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే..
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కుటుంబం గత 15 ఏళ్లుగా మాల్కాజ్ గిరిలోని వసంతపురి కాలనీలో నివసిస్తోంది. గురు కృపా అపార్ట్ మెంట్స్ లో వారు ఉంటున్నారు. భర్త డేవిడ్.. ఆల్విన్ అనే ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య మోనాలిసా, ఏడేళ్ల కూతురు షారోన్ మేరీతో జీవిస్తున్నాడు. అయితే మోనాలిసా మానసిక స్థితి కొంత కాలంగా సరిగా ఉండటం లేదని తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం మూడంతస్తుల బిల్డింగ్ మీదకు కూతుర్ని తీసుకెళ్లిన మోనాలిసా.. అక్కడి నుంచి కిందకు తోసేసింది. మెట్లపై పడటంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.
భర్తతో గొడవ
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాలికను హుటాహుటీనా గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారికి వైద్యులు చికిత్స చేస్తుండగా కొద్దిసేపటికే మృతి చెందింది. అయితే రెండ్రోజుల క్రితం భార్య, భర్తల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కారణం చేతనే కూతుర్ని మేడ నుంచి కిందికి తోసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే మోనాలిసా గత మూడేళ్లుగా మానసిక సమస్యకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read: West Bengal Voter’s: బెంగాల్‌లో రాజకీయ తుపాను.. ఓటర్ల జాబితాలో 58 లక్షల పేర్లు తొలగింపు
కన్నతల్లి అరెస్ట్!
డేవిడ్, మోనాలిసాకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత వారికి లేక లేక కూతురు షారోన్ మేరి పుట్టింది. కూతురు పట్ల తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. ఘట్ కేసర్ లోని సేవా భారతి క్రిస్టియన్ సంస్థలో మోనాలిసా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే తాజా ఘటనతో డేవిడ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇదిలా ఉంటే పాపకి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పాప అంత్యక్రియల అనంతరం తల్లి మోనాలిసాను అదుపులోకి తీసుకోనున్నారు.

