West Bengal Voter’s: బెంగాల్‌లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై విమర్శలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా (Draft SIR) ఓటర్ల జాబితాలో 58 లక్షల ఓట్లను తొలగించారు. ఇందులో 24 లక్షల మంది మరణించారని, 19 లక్షల మంది వలస వెళ్లారని, 12 లక్షల మంది కనిపించకుండా పోయారని ఈసీ పేర్కొంది. ఇక 1.3 లక్షలు డూప్లికేట్ గా గుర్తించినట్లు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో స్పష్టం చేసింది.
అభ్యంతరాలకు ఛాన్స్..
డ్రాఫ్ట్ జాబితా నుంచి పొరపాటున తొలగించబడిన వారు తమ అభ్యంతరాలు తెలియజేవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. పేర్లను చేర్చమని లేదా సవరణలు చేయమని దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం తుది ఓటర్ జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే తుది ఓటర్ల జాబితా వెలువడిన తరువాతే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బెంగాల్‌లో చివరిసారిగా 2002లో SIR నిర్వహించడం గమనార్హం.
ఓట్ల తొలగింపు అన్యాయం
ఓటర్ల జాబితా నుంచి 58 లక్షల మంది పేర్లను తొలగించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ తీవ్రంగా ఖండించారు. దీనిని అన్యాయంగా అభివర్ణించారు. చట్టబద్దమైన ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ చేసిన కుట్రగా ఆరోపించారు. తాము ఓటర్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని తృణమూల్ ఎంపీ తెలిపారు. తొలగింపబడిన ఓటర్లను తిరిగి జాబితాలో చేరేలా దరఖాస్తులు చేయడంలో సహాయం అందిస్తామని చెప్పారు.
దీదీ వర్సెస్ బీజేపీ
అయితే బెంగాల్ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎస్ఐఆర్ పై అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తొలగించేందుకు బీజేపీ, ఈసీ కలిసి చేస్తున్న కుట్రగా సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో కృష్ణనగర్ లో జరిగిన ఒక ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఓటర్ జాబితా నుంచి పేర్లు తొలగిస్తే ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అక్కాచెల్లెళ్లు వంటింట్లోని వస్తువులను సాధనాలుగా ఉపయోగించి పోరాటానికి దిగాలని పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీ సైతం మమతా వ్యాఖ్యలను దీటుగా తిప్పికొట్టింది. అక్రమ వలసదారులతో కూడిన తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు మమతా ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడింది.
Also Read: Viral Video: రూ.70 లక్షల బాణాసంచా.. గ్రాండ్ డెకరేషన్.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైరల్!
రాజకీయ తుపాను..
అయితే బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ల మధ్య ఓట్ల వ్యత్యాసం 22 లక్షలు మాత్రమేనని బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి అసెంబ్లీలో వెల్లడించారు. దీన్ని బట్టి తాజాగా ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ లో తొలగించిన 58 లక్షల మంది పేర్లు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది. దీంతో తాజాగా విడుదల చేసిన డ్రాఫ్ట్.. బెంగాల్ లో రాజకీయ తుపానుకు దారితీయవచ్చని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ, తృణమూల్ మధ్య మాటల దాడి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు.

