Pakistan Spy: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Air force) వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఈ పేరు ధైర్యసాహసానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. 2019 ఫిబ్రవరి నెలలో పాకిస్థాన్‌తో జరిగిన సైనిక సంఘర్షణలో మిగ్-21 బైసన్ జెట్ విమానాన్ని నడిపిన ఆయన, విధిలేని పరిస్థితుల్లో శత్రు దేశానికి చిక్కారు. కానీ, ఆయనలోని ధైర్యం ఆవగింజంత కూడా తగ్గలేదు. దేశ రహస్యాలు చెప్పాలంటూ పాక్ అధికారులు కోరినా, చెప్పబోనంటూ తన పరాక్రమాన్ని ప్రదర్శించారు. వర్థమాన్ చూపిన ధీరత్వం ప్రతీ భారతీయుడికి గర్వకారణంగా నిలిచింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అంతటి హీరోలు ఉండగా, గుండెనిండా దేశభక్తిని నింపుకోవాల్సిన ఓ రిటైర్డ్ అధికారి దాయాది దేశం పాకిస్థాన్‌కు సహకరిస్తూ (Pakistan Spy) దొరికిపోయాడు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యి.. దాయాది దేశం పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్న ఓ వ్యక్తిని అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ గూఢాచార నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై శుక్రవారం రాత్రి పోలీసులు శుక్రవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు కులేంద్ర సర్మ (Kulendra Sarma) అని, అతడు తేజ్‌పూర్‌లోని పాటియాకు చెందిన చెందినవాడని పేర్కొన్నారు. నిఘా పెట్టి, కదలికలను నిశితంగా పరిశీలించి, ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కులేంద్ర సర్మను అరెస్ట్ చేసినట్టు వివరించారు. బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కులేంద్ర సర్మపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు చెప్పారు. శనివారం అతడిని కోర్టులో కూడా ప్రవేశపెట్టారు.
Read Also- Akhanda2 Premiere: ‘అఖండ 2’ డే 1 ప్రీమియర్స్ గ్రాస్ ఎంతో తెలుసా?.. ఫ్యాన్స్‌కు పండగే..
పాక్ ఏజెన్సీలతో టచ్‌లో..
అరెస్టైన వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, కొందరు వ్యక్తులతో టచ్‌లో ఉంటూ, వారికి సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కులేంద్ర సర్మ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ నుంచి అనుమానాస్పద డేటా లభ్యమైంది. అయితే, కొంత డేటా తొలగించినట్టుగా అనుమానిస్తున్నారు. సర్మకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం బలంగా ఉందని, అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు దీనిని ధృవీకరించలేమని సోనిత్‌పూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హరిచరణ్ భూమిజ్ మీడియాకు వెల్లడించారు.
సర్మ రిటైర్‌మెంట్‌కు ముందు, తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జూనియర్ వారెంట్ ఆఫీసర్‌గా పనిచేసేవాడని, ఈ స్టేషన్‌లో సుఖోయ్ 30 స్క్వాడ్రన్‌తో పాటు ముఖ్యమైన విమాన అసెట్స్ ఉన్నాయి. సర్మ 2002లో పదవీ విరమణ చేశాడు. అనంతరం కొంతకాలం పాటు తేజ్‌పూర్ యూనివర్సిటీలో కూడా పనిచేశాడు.

