Hyderabad Crime: సంచలనం సృష్టించిన పవిత్ర హత్య కేసులో నిందితుడైన ఉమాశంకర్‌ను వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి లక్షా 10 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బాపూజీనగర్‌కు చెందిన లక్ష్మీ, కాంతారావుల కూతురు పవిత్ర. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టైల్స్ పనిచేసే ఉమాశంకర్ (24) పవిత్రకు వరుసకు మేనబావ. గతంలో ఉమాశంకర్, పవిత్రను ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటానని అడగగా, కుటుంబ సభ్యులు అంగీకరించారు. మంచి రోజు చూసి పెళ్లి చేస్తామని చెప్పారు. ఈనెల 6న లక్ష్మీ, కాంతారావులు తమ కూతుళ్లతో కలిసి విజయవాడ దైవ దర్శనానికి వెళ్లి మరుసటి రోజు తిరిగి వచ్చారు. 8న మధ్యాహ్నం 12.15 గంటలకు ఉమాశంకర్ వీరి ఇంటికి వచ్చి, తన అనుమతి తీసుకోకుండా పవిత్రను విజయవాడ ఎందుకు తీసుకెళ్లారని లక్ష్మీతో గొడవ పడ్డాడు.
Also Read: Hyderabad Crime News: నగరంలో తీవ్ర విషాదం.. వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!
గొంతు కోసి పరార్
అప్పటికే ఉమాశంకర్ మద్యం తాగి ఫోన్లు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడటంతో, అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పవిత్ర తన తల్లితో చెప్పింది. ఈ విషయం తెలిసి ఉమాశంకర్ పవిత్రతో కూడా గొడవ పడ్డాడు. లక్ష్మీ నీళ్లు తాగడానికి లోపలి గదిలోకి వెళ్లగా, వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రపై దాడి చేసిన ఉమాశంకర్ ఆమె గొంతు కోసేశాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన పవిత్ర అక్కడికక్కడే మరణించింది. ఆ వెంటనే కత్తి, మొబైల్ ఫోన్‌ను అక్కడే వదిలేసి ఉమాశంకర్ పారిపోయాడు. వారాసిగూడ సీఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో నిందితుడి కోసం గాలించారు. బుధవారం ఉమాశంకర్ చిలకలగూడలోని స్కంధగిరి ఆలయం వద్ద తిరుగుతున్నట్టు గుర్తించి, తన సోదరుని ఇంట్లో తలదాచుకున్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితున్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: Hyderabad Crime: ట్రాన్స్ జెండర్ కోసం.. ఫ్రెండ్స్ మధ్య గొడవ.. కత్తులతో పొడిచి యువకుడి హత్య

