Medak District: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మొదటి విడుత సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల అధికారులు ఫలితాలు ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను చేపట్టనున్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఆయా జిల్లాల కలెక్టర్లు (రాహుల్ రాజ్, హైమావతి, ప్రావీణ్య) ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది బస్సులలో వారికి కేటాయించిన గ్రామాలకు బ్యాలెట్ బాక్సులతో సహా చేరుకున్నారు.
Also Read: Medak District: ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలు
జిల్లాల వారీగా ఎన్నికల వివరాలు
మెదక్ జిల్లాలో హవేలీ ఘన్‌పూర్, అల్లాదుర్గం, రేగోడు, టెక్మాల్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాల్లో తొలి విడుత ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 260 గ్రామ పంచాయతీలకు 10402 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 16 గ్రామ పంచాయతీలు, 332 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 144 సర్పంచ్, 1068 వార్డు స్థానాలకు గురువారం పోలింగ్ జరుగనుంది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, దౌల్తాబాద్, జగదేవ్‌పూర్, మార్కూక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లో మొదటి విడుత ఎన్నికలు జరుగుతాయి. ఈ మండలాల్లో 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డు స్థానాలకు తొలి విడుత ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక్కడ కూడా 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇదిలా ఉండగా, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, గుమ్మడిదల, హత్నూర, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్ చెరువు మండలాల్లో మొదటి విడుత సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, హైమావతి, ప్రావీణ్యలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత..
సమస్యాత్మక గ్రామాల్లో ఆయా జిల్లాల ఎస్పీలు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట సీపీ ఆధ్వర్యంలో గజ్వేల్ రెవెన్యూ డివిజన్‌లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరిగే అన్ని గ్రామ పంచాయతీలకు సిబ్బంది తరలివెళ్లడంతో ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది.
Also Read: Medak District: బలవంతంగా భూసేకరణ.. కన్నెర్ర చేసిన రైతులు.. అధికారులను బంధించి..!

