Rahul Gandhi – RSS: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై లోక్‌సభలో కీలక చర్చ జరిగింది. ఎన్నికల సంస్కరణలపై చర్చ జరగగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, సభలో అందరికీ సమాన అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పాలక పక్షంపై విమర్శలు గుప్పిస్తూ ఆర్ఎస్ఎస్ టార్గెట్‌గా (Rahul Gandhi – RSS) విమర్శనాస్త్రాలు సంధించారు. సమానత్వం అనే సూత్రాన్ని ఆర్ఎస్ఎస్ తిరస్కరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘యూనియన్ ఆఫ్ ఇండియాలో ప్రతి వ్యక్తి సమానం అనే ఆలోచన ఆర్ఎస్ఎస్‌లోని నా స్నేహితులను కలవరానికి గురిచేస్తోంది. మన దేశంలో ప్రతి ఒక్క ఒక దారం లాంటివారు. ఆ దారాల కలయికతో ఏర్పాటైన వస్త్రాన్ని (భారతదేశాన్ని) చూసి వాళ్లు (ఆర్ఎస్ఎస్) సంతోషిస్తారు. కానీ, మన దేశ వస్త్రంలో ప్రతి ఒక్కరూ, ఏ మతానికి, సమాజానికి, భాషకు చెందినవారైనా సమానమే అనే ఆలోచనను ఆర్ఎస్ఎస్ వాళ్లు జీర్ణించుకోలేరు. ఎందుకంటే, వాళ్లు సమానత్వాన్ని నమ్మరు. నిచ్చెల మెట్ల వ్యవస్థను నమ్ముతారు. అంతేకాదు, ఆ వ్యవస్థలో వాళ్లు అగ్రస్థానంలో ఉండాలని భావిస్తారు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతి పౌరుడు సమానమైన దారాన్ని సూచించేందుకు మహాత్మా గాంధీ ఖాదీని ధరించారని అన్నారు.
Read Also- CM Revanth Convoy: సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం.. రేవంత్‌కు త్రుటిలో తప్పిన ముప్పు
సభలో దుమారం
బీజేపీకి సిద్ధాంత మార్గదర్శి అయిన ఆర్ఎస్ఎస్ సంస్థ… దేశ సంస్థాగత వ్యవస్థలైన విద్య, చట్టాల అమలు, ఎన్నికల యంత్రాంగాలను మొత్తం తన నియంత్రణలోకి తీసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారతదేశ పౌరులందరూ సమానమనే ఆలోచన ఆర్ఎస్ఎస్‌కు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1948 జనవరిలో నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారంటూ ఆయన సభలో ప్రస్తావించారు. సభలో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సభలో గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీలు ఖండించారు. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డుతగిలారు. ప్రతిపక్ష నాయకుడు ‘సర్’ అంశంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంస్కరణలను ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
ఓటు చోరి నిజమైన దేశద్రోహం
‘సర్’ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సర్కారు విమర్శలు గుప్పించారు. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ ఫొటోను హర్యానాలో మొత్తం 22 మంది ఓటర్ల గుర్తింపు కార్డుపై ఉండడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఓటు చోరీకి పాల్పడడమే నిజమైన దేశ ద్రోహమని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also- Minister Sridhar Babu: ప్రభుత్వం వేసే ప్రతి అడుగు భావితరాల కోసమే: మంత్రి శ్రీధర్ బాబు
కేంద్రానికి కీలక ప్రశ్నలు
ఈ సందర్భంగా కేంద్రాన్ని రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్రక్రియను ఎందుకు మార్చిందని అడిగారు. చేసిన మార్పులు పాలక పక్షానికి అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని నిలదీశారు. ఈ మార్పు పాలక పక్షానికి అనుకూలమైనదని, పక్షపాతాన్ని సృష్టిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల తర్వాత 45 రోజులలోపే సీసీటీవీ పుటేజీని తొలగింపునకు అనుమతించే చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీని అవసరం ఏమిటో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

