CM Revanth Reddy: తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు, దేశ పారిశ్రామిక వేత్తలకు ఈ సందర్బంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవ శుభాకాంక్షలను సీఎం తెలియజేశారు.
ఈ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ప్రజల ఆలోచనలను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ తల్లిని స్ఫూర్తిగా తీసుకున్నాం. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ సరిగ్గా ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు. సోనియా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఆత్మగౌరవాన్ని అందించాయి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9 కి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిందని రేవంత్ రెడ్డి అన్నారు. 60 సంవత్సరాల ప్రజల బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినంగా భావిస్తూ డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. నేటి ప్రతి ఏటా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుతామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.
Also Read: Viral Video: పెళ్లైన వ్యక్తితో ఎఫైర్.. భర్తతో ఉండగా భార్య ఎంట్రీ.. యువతి చేసినదానికి అంతా షాక్!
గతేడాది రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుని ఒక స్ఫూర్తి తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఆవిష్కరించుకున్నాం. స్వరాష్ట్ర కల నిజమై తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నిటారుగా నిలబడింది. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రూపు దిద్దుకుంటోంది’ అని సీఎం రేవంత్ అన్నారు.

