Medak Police: మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ కీలకపాత్ర పోషిస్తోందని, అందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, సోషల్ మీడియా అకౌంట్లు, ఫోటోలు, కాంటాక్ట్స్ వంటి ముఖ్యమైన డేటా ఉంటుందని గుర్తుచేశారు. ఫోన్ పోయినప్పుడు లేదా చోరీకి గురైనప్పుడు ప్రజలు ఆందోళన చెందకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి, CEIR పోర్టల్ (www.ceir.gov.in) లో వివరాలను నమోదు చేయాలని సూచించారు.
రూ.15,34,000 విలువగల 110 మొబైల్ ఫోన్లను రికవరీ
ఈ కార్యక్రమంలో ఇటీవల జిల్లాలో పోగొట్టుకున్న రూ.15,34,000 విలువగల 110 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం 1,734 మొబైల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు.తమ కోల్పోయిన ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. CEIR పోర్టల్ సాయంతో పోయిన ఫోన్లను గుర్తించడం చాలా సులభమని, ప్రతి ఒక్కరు దీనిని వినియోగించుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో CEIR కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఫోన్ పోయిన సందర్భంలో నిర్లక్ష్యం చేస్తే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Also Read: Medak Police: గిరిజన మహిళ హత్యకేసును 5 రోజుల్లోనే ఛేదించిన పోలీసులు.. వెలుగులోకి సంచలన నిజాలు!
పోలీస్ స్టేషన్లో అప్పగించాలని విజ్ఞప్తి
దొంగిలించిన ఫోన్లు నేరాలకు ఉపయోగించే అవకాశం ఉన్నందున CEIR లో నమోదు చేయడం తప్పనిసరి అని తెలిపారు. సెకండ్‌హ్యాండ్ ఫోన్లు కొనే ముందు అవి చోరీకి గురైయినవో కాదో తప్పనిసరిగా చెక్ చేయాలని సూచించారు.ఎవరికైనా మొబైల్ ఫోన్ దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. వీక్ పాస్‌వర్డ్‌ల వలన ఫోన్లు సులభంగా అన్‌లాక్ అయ్యి బ్యాంకింగ్ యాప్‌లు, UPI, వాట్సాప్ వంటి యాప్‌లలోని డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు.
మొబైల్ పోయిన వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులకు తెలియజేసి UPI లావాదేవీలను బ్లాక్ చేయించుకోవడం అత్యంత ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో మొబైల్స్ రికవరీలో సాంకేతిక నైపుణ్యం ప్రదర్శించిన ఐటీ కోర్ టీమ్ కానిస్టేబుల్స్ విజయ్, వెంకట్ గౌడ్, మహేందర్ గౌడ్, అలాగే వివిధ పోలీస్ స్టేషన్లలో CEIR పోర్టల్ ద్వారా విశేష ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఎస్పీ ప్రశంస పత్రాలను అందజేసి, రివర్డ్ ప్రకటించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ మహేందర్,DCRB ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఐటీ కోర్ సిబ్బంది, CEIR పోర్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!

