Indigo Disruptions: ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయ పరిస్థితుల్లో (Indigo Disruptions) ఆదివారం నాడు కాస్త మెరుగుదల కనిపించింది. సర్వీసుల సంఖ్య కొద్దిమేర పెరిగింది. ఇక, అనూహ్య పరిస్థితుల్లో రద్దైన ప్రయాణాలకు సంబంధించిన రిఫండ్‌ను ఇండిగో సంస్థ ప్రాసెస్ చేసింది. ఆదివారం సాయంత్రానికి మొత్తం రూ.610 కోట్లు విలువైన రిఫండ్‌లను ప్రాసెస్ చేసినట్టు సంస్థ వెల్లడించింది. అలాగే, రద్దు కారణంగా ప్రభావితమైన రీషెడ్యూల్‌పై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ఆదివారం రాత్రి 8 గంటలకల్లా రిఫండ్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. రిఫండ్, రీబుకింగ్ సమస్యల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్యాసింజర్లు అసౌకర్యాలకు గురికాకుండా అదనపు సాయం కోసం ప్రత్యేక సహాయక కేంద్రాలను కూడా ఇండిగో సంస్థ ఏర్పాటు చేసింది.
మరోవైపు, లగేజీలను ప్రయాణికులకు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంది. ప్రయాణ అంతరాయాల కారణంగా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న మొత్తం లగేజీలను 48 గంటల్లోగా గుర్తించి, అందజేయాలంటూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించడంతో ఈ చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం అందిస్తూ ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో శనివారం నాటికే దేశవ్యాప్తంగా ప్యాసింజర్లకు 3,000 లగేజీ బ్యాగులను డెలివరీ చేసినట్టు పేర్కొంది.
Read Also- New Guy In Town: సంచలనం రేపుతున్న ఎస్. థమన్ ట్వీట్.. టాలీవుడ్‌లో ఆ మిస్టీరియస్ ‘న్యూ ఫేస్’ ఎవరు?
మెరుగుపడిన సర్వీసులు
మరోవైపు, ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య ఆదివారం నాడు కాస్త పెరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన డేటా ప్రకారం, శనివారం 1,500 విమానాల సర్వీసులు నడపగా, ఆదివారం 1,650 కంటే ఎక్కువ విమానాలను నడపడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. 138కి గానూ 137 గమ్యస్థానాలలో కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇక, షెడ్యూల్ ప్రకారం బయలుదేరే విమానాల సంఖ్య శనివారం 30 శాతంగా ఉండగా, ఆదివారం అది 75 శాతానికి పెరిగిందని ఇండిగో వివరించింది. డిసెంబర్ 15 వరకు బుకింగ్‌ల రద్దు, రీషెడ్యూల్ అభ్యర్థనలపై అదనపు ఛార్జీలు ఏమీ ఉండబోవని ఎయిర్‌లైన్ మరోసారి స్పష్టం చేసింది. రిఫండ్‌లు, లగేజీ అందించే ప్రక్రియలను గాడిలో పెట్టే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపింది. సేవలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు నిరంతరాయం పనిచేస్తున్నామని, దయచేసి తమకు సహకరించాలని ఇండిగో తాజా స్టేటస్ అప్‌డేట్‌లో విజ్ఞప్తి చేసింది.
Read Also- Bigg Boss Elimination: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా?

