Navjot Singh Sidhu: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్, పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ (Navjot Singh Sidhu) ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. అయితే, సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ (Navjot Kaur Sidhu) ఆదివారం నాడు (డిసెంబర్ 7) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూను పంజాబ్‌లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రకటిస్తేనే ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి వస్తారని ఆమె వ్యాఖ్యానించారు. ఏ పార్టీకీ ఇవ్వడానికి తమ వద్ద డబ్బు లేదని, అయితే, పంజాబ్‌ను ‘బంగారు రాష్ట్రంగా’ మారుస్తామని నవజ్యోత్ కౌర్ పేర్కొన్నారు.
మా దగ్గర రూ.500 కోట్లు లేవు
తాము ఎప్పుడూ పంజాబ్ గురించి, పంజాబీల గురించే మాట్లాడతామని, కానీ ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడానికి అవసరమైన రూ.500 కోట్లు తమ వద్ద లేవని నవజ్యోత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశఆరు. పంజాబ్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతలతో పాటు పలు అంశాలపై ఆ రాష్ట్ర గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను శనివారం ఆమె కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డబ్బు ఇవ్వాలని ఎవరైనా డిమాండ్ చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఎవరూ డిమాండ్ చేయలేదని ఆమె సమాధానం ఇచ్చారు. కానీ, రూ. 500 కోట్లతో సూట్‌కేస్ ఇచ్చే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
Read Also- Viral Video: చాలా బోర్ కొడుతోంది.. ఇక పని చేయలేనంటూ.. ఉద్యోగం వదిలేసిన Gen Z కుర్రాడు
ఏ పార్టీ అవకాశం ఇచ్చినా..
నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఏ రాజకీయ పార్టీ అధికారాన్ని ఇచ్చినా.. దాని ద్వారా ఆయన పంజాబ్‌ను అభివృద్ధి పరచగలరని నవజ్యోత్ కౌర్ వ్యాఖ్యానించారు. ‘‘ఏ పార్టీకీ ఇవ్వడానికి మా వద్ద డబ్బు లేదు. అయితే, మేము ఫలితాలను ఇస్తాం. మేము పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తాం’’ అని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలను ప్రస్తావిస్తూ, ఇప్పటికే సీఎం పదవిని ఐదుగురు నాయకులు కోరుకుంటున్నారని, వారు సిద్ధూను ముందుకు రానివ్వరని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో, పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో సిద్ధూకి బలమైన అనుబంధం ఉన్నాయని నవజ్యోత్ కౌర్ పేర్కొన్నారు. మంచి అనుబంధం ఉన్నప్పటికీ ఈ స్థాయి అంతర్గత కలహాల మధ్య, వారు నవజ్యోత్ సిద్ధూను ప్రోత్సహిస్తారని తాను అనుకోబోనని కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. ఎందుకంటే, పంజాబ్ కాంగ్రెస్‌లో ఐదుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, వారంతా కాంగ్రెస్‌ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయం వాళ్లకు ((హైకమాండ్ పెద్దలు) అర్థమైతే అది వేరే విషయమని ఆమె అన్నారు.
Read Also- Uttam Kumar Reddy: పారా బాయిల్డ్ రైస్‌పై.. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ వినతి!
బీజేపీ ఆఫర్ ఇస్తే వెళ్తారా?
ఒకవేళ బీజేపీ ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తామంటే ఆ పార్టీలోకి సిద్ధూ వెళ్తారా అని అడగ్గా.. ఆయన తరపున తాను స్పందించలేనని నవజ్యోత్ కౌర్ పేర్కొన్నారు. సిద్దూ ప్రస్తుతం బాగా డబ్బు సంపాదిస్తున్నారని, సంతోషంగా కూడా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, గతంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా వ్యవహరించిన సిద్ధూ గత కొన్ని చాలా నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. ఐపీఎల్- 2024 సీజన్‌లో తిరిగి క్రికెట్ కామెంటరీ చెప్పారు. కాగా, క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి ఎప్పుడొస్తారని ఓ సందర్భంలో సిద్ధూను ప్రశ్నించగా, ‘కాలం చెబుతుంది’ అని ఆయన అన్నారు. కాగా, పంజాబ్‌లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

