IndiGo Flight Crisis: ఇండిగో సంక్షోభంతో విమానయాన రంగం ఒక్కసారిగా కుదేలైంది. పెద్ద ఎత్తున ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇతర విమానయాన సంస్థలను తమ టికెట్లను అమాంతం పెంచడం మరో అతిపెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఇండిగో గందరగోళంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రస్తుత పరిస్థితులకు ఇండిగో వైఫల్యమే కారణమని తేల్చిచెప్పారు. ఆ సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘ఇండిగో తప్పు చేసింది’
ఇండిగో సంక్షోభంపై ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ప్రస్తుతం ఈ సమస్య పరిష్కార దశలో ఉందని స్పష్టం చేశారు. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నవంబర్ లోనే అమల్లోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మిగతా విమానయాన సంస్థలకు లేని సమస్య.. ఇండిగోకే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దీనిని బట్టి తప్పు ఇండిగోలోనే ఉందని స్పష్టమవుతోందని రామ్మోహన్ నాయుడు అన్నారు.
‘రాత్రికి సమస్య తీరిపోతుంది’
ఇండిగో విమానాల రద్దుతో దిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. అయితే ఈ రాత్రికే ఇండిగో సమస్య తీరిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రేపటి నుంచే పరిమిత సంఖ్యలో ఇండిగో తన కార్యకలాపాలను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. కార్యాకలాపాలు సవ్యంగా సాగే కొద్ది ఇండిగో తిరిగి తమ సామర్థ్యాన్ని పెంచుకుంటుందని అన్నారు. అయితే ఇండిగో పూర్తి సామర్థ్యంతో విమాన సేవలు అందించడానికి ఇంకొన్ని రోజులు పట్టవచ్చని రామ్మోహన్ నాయుడు అంచనా వేశారు.
‘సమస్య ఉంటే ముందే చెప్పాలి’
ఎఫ్ డీఎల్ నిబంధనల వల్లే ఇండిగో సంక్షోభం వచ్చిందన్న ఆరోపణలను పౌర విమానయాన మంత్రి ఖండించారు. నవంబర్ 1 నుంచే ఆ నిబంధనలు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు. ఆ సమయంలో నిరంతరం విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు. కొత్త నిబంధనలతో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? లేదా? అన్నది నిరంతరం పర్యవేక్షించామని చెప్పారు. ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెప్పాలని అనేక మార్లు విమానయాన సంస్థలకు సూచించినట్లు తెలిపారు. ఇండిగో మినహా ఇతర విమానయాన సంస్థలకు ఎఫ్ డీఎల్ నిబంధనలు సమస్యగా మారలేదని స్పష్టం చేశారు.
Also Read: Ponguleti Srinivas Reddy: గుడ్ న్యూస్.. మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కీలక మార్పులు.. అవి ఇవే..!
‘ఇండిగోపై చర్యలు తీసుకుంటాం’
ఇండిగోపై చర్యలు తీసుకుంటారా? లేదా? అన్న ప్రశ్నకు రామ్మోహన్ నాయుడు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులే తమ మెుదటి ప్రాధాన్యమన్న రామ్మోహన్ నాయుడు.. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చూసుకోవడం తమ బాధ్యత అని అన్నారు. కాబట్టి ఇండిగో సంక్షోభంపై విచారణ చేపట్టి.. కచ్చితంగా ఆ సంస్థపై చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన మంత్రి స్పష్టం చేశారు.

