Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 4 లక్షల ఇండ్లను మంజూరు చేశామని, 3 లక్షల ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srnivass Reddy) వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఒక లక్ష ఇందిరమ్మ ఇండ్లకు గృహ ప్రవేశాలు చేస్తామని, ఆ తర్వాత జూన్ నాటికి మరో 2 లక్షల గృహ ప్రవేశాలు జరుగుతాయని మంత్రి స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హౌసింగ్ శాఖలో రెండేళ్ల ప్రగతిని పొంగులేటి వివరించారు.
అఫర్డ్‌బుల్ హౌసింగ్ పాలసీ
రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ(GHMC)తో సహా అన్ని పట్టణాలు, నగరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం మంజూరుకు ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు. జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించే గృహాల కోసం అతికొద్ది రోజుల్లో పాలసీని ప్రకటించబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వానికి లాభ నష్టాలు లేకుండా సరసమైన ధరకు ఇండ్లను నిర్మించి అఫర్డ్‌బుల్ హౌసింగ్ పాలసీ(Affordable Housing Policy)కి త్వరలో రూపకల్పన చేయబోతున్నట్లు తెలిపారు. దీనికోసం ఓఆర్ఆర్(ORR) చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఒక్కోచోట 8 నుంచి 10 వేల ఇండ్లు నిర్మించే ప్రతిపాదన ఉందని మంత్రి పొంగులేటి వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై గ్లోబల్ సమ్మిట్‌లో కూడా చర్చించనున్నట్లు వివరించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మించిన ఇండ్లు శిథిలమవుతున్నాయని, వాటిని తొలగించి హైరైజ్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read: Rural Politics: పట్నంపై పల్లె ఫోకస్.. ఓట్ల కోసం నాయకులు ఆఫర్ల మీద ఆఫర్లు
గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరణ
గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 2 బీహెచ్ కే ఇండ్ల నిర్మాణాన్ని రూ.700 కోట్లతో పూర్తిచేసినట్లు పొంగులేటి తెలిపారు. రూ.200 కోట్లతో ఆయా కాలనీలకు మౌలిక వసతులు కల్పించినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు పరిధిలో లీజుకు తీసుకున్న లేదా కబ్జా అయిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాల భూమికి ప్రహారీ గోడలు నిర్మించినట్లు వివరించారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణశాఖను పూర్తిగా రద్దు చేసిందని, పేదలకు పక్కా ఇండ్లు నిర్మించాలన్న ఆలోచనతో తిరిగి గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. దీనికోసం 394 మంది డీఈఈలను వెనక్కి రప్పించామని, 800 మంది ఏఈలను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నామని, అంతేకాకుండా వివిధ శాఖల నుంచి 152 మందిని, రెవెన్యూ శాఖ నుంచి 32 మందిని డిప్యూటేషన్‌పై తీసుకున్నట్లు స్పష్టంచేశారు. పూర్తిస్థాయిలో గృహనిర్మాణ శాఖను రూపొందించి ప్రణాళికా బద్ధంగా ముందుకువెళ్తున్నట్లు చెప్పారు.
మూడో విడుత ఇందిరమ్మ ఇండ్లు
ఇందిరమ్మ ఇండ్ల పథకం అవినీతి రహితంగా సాగాలని భావించి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటున్నామని పొంగులేటి వివరించారు. లంచమడిగిన 9 మంది పంచాయతీరాజ్ కార్యదర్శులను సస్పెండ్ చేసినట్లు గుర్తుచేశారు. మరో ఇద్దరిని సర్వీస్ నుంచి తొలగించినట్లు చెప్పారు. గృహజ్యోతి పథకంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త పథకం వర్తించేలా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివరించారు. మూడో విడుత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో స్థలాలు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించే అంశాన్ని కేబినెట్‌లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్లస్ 4 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు.
Also Read: Inspire Science Fair: మెదక్‌లో ముగిసిన సైన్స్ఫెయిర్.. విజేతలకు సర్టిఫికెట్స్ అందజేత..!

