Cartier Watches Controversy: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం చుట్టూ ఇటీవల పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సీఎంగా సిద్ధరామయ్యను తప్పించి ముందస్తు ఒప్పందం ప్రకారం తనకు అవకాశం కల్పించాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే రెండుసార్లు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో ఇరువురు నేతలు కలిసి.. ఆ చర్చలకు బ్రేక్ పడేలా చేశారు. అయితే అల్పాహారం భేటి నుంచే మరో కొత్త వివాదం పుట్టుకురావడం.. డీకే, సిద్దరామయ్య ఇద్దరికి తలనొప్పిగా మారింది. ఒకే రకమైన ఖరీదైన వాచ్ లతో ఇరువురు నేతలు భేటిలో పాల్గొనడం రాజకీయ దుమారానికి కారణమైంది.
అసలేం జరిగిందంటే?
మంగళవారం జరిగిన బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ మధ్య ఐక్యతను ప్రదర్శిస్తూ కరచలనం చేశారు. ఈ సందర్భంగా వాళ్ల చేతికి ఉన్న ఖరీదైన వాచ్ తళ తళా మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ జాతీయ మీడియా దీనిని హైలెట్ చేస్తూ అది ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ కంపెనీ కార్టియర్ కు చెందిన శాంటోస్ డే కార్టియర్ మోడల్ (Santos de Cartier model) మోడల్ వాచ్ అని పేర్కొంది. వాచ్ విలువ బహిరంగ మార్కెట్ లో రూ.43 లక్షలు పైనే ఉంటుందని పేర్కొంది.
బీజేపీ తీవ్ర దాడి..
దీంతో సిద్దరామయ్య, డీకే ధరించిన వాచ్ లను తన రాజకీయ అస్త్రంగా కర్ణాటక బీజేపీ మార్చుకుంది. ఇరువురు నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించింది. సీఎం సిద్దరామయ్య ధరించే వాచ్ ల విలువ రూ. కోట్లల్లో ఉంటుందని శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడు చాళవాడి నారాయణ స్వామి ఆరోపించారు. ఆయనకు ఇలాంటి లగ్జరీ వాచ్ లు గతంలో 8 ఉండేవని.. ఇప్పుడు వాటి సంఖ్య 18-19 చేరాయని ఆరోపించారు. సిద్దరామయ్యకు ఎన్ని వాచ్ లు ఉన్నా తమకు నష్టం లేదని.. కానీ ఎన్నికల అఫిడవిట్ లో వాటిని ఎందుకు పొందుపరచలేదని నారాయణ స్వామి నిలదీశారు.
డీకే శివకుమార్ పైనా..
మరోవైపు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను సైతం నారాయణ స్వామి టార్గెట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఈ కార్టియర్ వాచ్ ను కొనుగోలు చేసినట్లు గతంలో డీకే చెప్పారు. ఆస్ట్రేలియాలో రూ.27 లక్షలకు దీనిని కొన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ గడియారం దొంగతనం చేసింది కాదా? అంటూ వ్యంగ్యంగా నారాయణ స్వామి ప్రశ్నించారు. వాస్తవానికి వాచ్ ల వివాదం మెుదలైనప్పుడే డీకే శివకుమార్ మీడియాలో స్పష్టత నిచ్చారు. తాను క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేశానని, ఎన్నికల అఫిడవిట్లో కూడా దానిని పేర్కొన్నట్లు గుర్తుచేశారు.
Also Read: CM Revanth Reddy: నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.532 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
డీకే రియాక్షన్ ఇదే..
అయితే బీజేపీ నేత నారాయణ స్వామి.. డీకే శివకుమార్ అఫిడవిట్ చూపిస్తూ అందులో కార్టియర్ వాచ్ ఎక్కడ చూపించారని నిలదీశారు. రూ.9 లక్షల రోలెక్స్, రూ.24 లక్షల హుబ్లాట్ వాచ్ ల గురించి మాత్రమే పేర్కొన్నారని చెప్పారు. అసలు కార్టియర్ వాచ్ గురించి ప్రస్థావనే అందులో లేదని ఆరోపించారు. అయితే శివకుమార్ మరోమారు నారాయణ స్వామి ఆరోపణలను ఖండించారు. తన అఫిడవిట్ గురించి బీజేపీకి ఏం తెలుసని ప్రశ్నించారు. తన సొంత డబ్బు, క్రెడిట్ కార్డుతో కార్టియర్ వాచ్ కొన్నట్లు మరోమారు పేర్కొన్నారు. నారాయణ స్వామి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్ఫష్టం చేశారు. మెుత్తం మీద సీఎం సీటు పంచాయితీ పక్కకు పోయి.. వాచ్ ల అంశం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

