Marriage Scam: పెళ్లి పేరిట టోకరా
రూ.3.38 లక్షలకు కుచ్చుటోపి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పెళ్లి పేరిట ఓ మహిళకు టోకరా (Marriage Scam) ఇచ్చిన ఓ సైబర్ మోసగాడు ఏకంగా రూ. 3.38 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. సైదాబాద్ వినయ్ నగర్ కాలనీలో ఒంటరిగా ఉంటున్న ఓ 47 ఏళ్ల మహిళ పెళ్లి చేసుకోవాలని భావించింది. తనకు తగిన వ్యక్తి కోసం ఎదురుచూస్తుండగా, ఓ వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. తన పేరు హిరాద్ అహమద్ అని పరిచయం చేసుకున్న అతడు, యూకేలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్టు చెప్పుకున్నాడు. వాట్సాప్ కాల్స్ చేసి తియ్యటి మాటలతో ఆమె నమ్మకాన్ని చూరగొన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో రెండు బ్యాంక్ అకౌంట్లు తెరిపించాడు. దీనికోసం 2 సిమ్ కార్డులు కొనిపించాడు.
ఆ తర్వాత బ్యాంక్ పాస్ బుక్కులు, ఏటీఎం కార్డులను ఢిల్లీలోని యూకే అఫైర్స్ ఆఫీస్ చిరునామా పేరిట తన అడ్రస్‌కు తెప్పించుకున్నాడు. ఆ తర్వాత సహచరులతో కలిసి ఫేక్ వీసా, పెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు పంపించాడు. అనంతరం వీసా ఫీజ్, లేట్ ఛార్జీలు, హోటల్ స్టే ఇలా రకరకాల సాకులు చెప్పి మొత్తం రూ.3.38 లక్షలు తన ఖాతాలోకి వేయించుకున్నాడు. ఆ తర్వాత ట్విస్ట్ ఇస్తూ.. కాంటాక్ట్‌లో లేకుండా పోయాడు. అప్పుడు మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు పోగొట్టుకున్నందుకు ఆమె లబోదిబోమంటోంది.
Read Also- Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?
మరో సైబర్ మోసం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఏపీకే ఫైళ్లు పంపించి సైబర్ క్రిమినల్స్ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి నుంచి డబ్బు కొల్లగొట్టారు. ఆలస్యంగా మోసపోయినట్టు గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. శక్కర్‌గంజ్ ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసిన అపరిచిత వ్యక్తి తనను తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. సరైన టైంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు చెయ్యని కారణంగా విధించిన పెనాల్టీ మొత్తాన్ని రద్దు చేస్తానని చెప్పి ఓ ఏపీకే ఫైల్ పంపించాడు. బాధితుడు ఫైల్ ఓపెన్ చెయ్యగానే అతడి ఫోన్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకున్న సైబర్ క్రిమినల్.. అతడి ఖాతా నుంచి రూ.1.72 లక్షలు కొట్టేశాడు.
మరో ఘటనలో పటేల్ నగర్‌లో ఉంటున్న 45ఏళ్ల వ్యక్తికి ఇలాగే ఫోన్ చేసిన సైబర్ మోసగాడు తనను తాను ఐడీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు డిపార్ట్మెంట్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగింది అని చెప్పి వాట్సాప్ ద్వారా ఓ లింక్ పంపాడు. దాంట్లో క్రెడిట్ కార్డు నెంబర్, ఇతర వివరాలు పూర్తి చెయ్యమన్నాడు. బాధితుడు అలా చెయ్యగానే అతని ఖాతా నుంచి రూ.2.95 లక్షలు కొట్టేశాడు. యాకుత్ పురాకు చెందిన వ్యక్తికి ఆర్టీవో చాలాన్ పేరిట ఏపీకే ఫైల్ పంపించిన మోసగాడు ఆ ఫైల్‌ను బాధితుడు ఇన్‌స్టాల్ చెయ్యగానే రూ.2.26 లక్షలు కొట్టేశాడు. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తికి ఇండస్ఇండ్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. సైబర్ క్రిమినల్ అతడి ఫోన్‌కు ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పేరిట ఏపీకే ఫైల్ పంపాడు. దాన్ని క్లిక్ చెయ్యగానే అతడి అకౌంట్ల నుంచి రూ.1.31 లక్షలు ఎగిరిపోయాయి.
