Big Ticket Abu Dhabi: అదృష్టం ఎవరినీ, ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. నిన్నటి వరకు అతి సామాన్యుడిగా ఉన్న వ్యక్తి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన సందర్భాలు గతంలో చాలానే చూశాం. తాజాగా మరో వ్యక్తి ఈ జాబితాలో చేరాడు. అది కూడా యూఏఈలో అతడ్ని అదృష్టం వరించింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న కేరళ వాసి పీవీ రాజన్.. అబుదాబి బిగ్ టికెట్ లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు. లాటరీలో 25 మిలియన్ దిర్హమ్ లను గెలుచుకున్నారు. భారత కరెన్సీలో దీని విలువ అక్షరాల రూ.61.37 కోట్లు కావడం విశేషం.
15 ఏళ్లుగా టికెట్ కొనుగోలు..
అబుదాబి బిగ్ టికెట్ నిర్వాహకులు బుధవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. పి.వి రాజన్ కొనుగోలు చేసిన 282824 నెంబర్ గల టికెట్ కు జాక్ పాట్ తగిలింది. ఈ విషయాన్ని రాజన్ కు ఫోన్ చేసి నిర్వాహకులు తెలిపారు. లాటరీ టికెట్ ను రాజన్.. నవంబర్ 9న కొనుగోలు చేశారు. ఆయన గత 15 ఏళ్లుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి 15 మంది సహోద్యోగులతో కలిసి రాజన్ టికెట్ కొనుగోలు చేశారు. దీంతో ఈ లాటరీ సొమ్మును వారితో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజన్.. సౌదీ అరేబియాలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.
మరో నలుగురు అదృష్టవంతులు
డిసెంబర్ జాక్‌పాట్ విజేత టికెట్‌ను గత నెల జాక్‌పాట్ విజేత అయిన శరవణన్ వెంకటాచలం తీశారు. ఆయన కూడా ప్రవాస భారతీయుడే కావడం గమనార్హం. బిగ్ టికెట్ అబుదాబి ప్రతీ నెల లాటరీ డ్రాలు నిర్వహిస్తుంటుంది. గ్రాండ్ ప్రైజ్ తో పాటు పలు కన్సోలేషన్ బహుమతులు సైతం అందిస్తుంటుంది. ఈసారి పదిమంది అదృష్టవంతులను కన్సోలేషన్ బహుమతులకు ఎంపిక చేశారు. వారికి లక్ష దిర్హమ్ విలువైన గిఫ్టులను అందజేయనున్నారు. అయితే వారిలోనూ నలుగురు భారతీయులు ఉండటం విశేషం. టింటో జెస్ మోన్, సునీల్ కుమార్, రాకేష్ కుమార్, షేక్ మహమ్మద్ నజీర్ ఆ నలుగురు కావడం గమనార్హం.
డ్రీమ్ కార్ విజేత
బుధవారం జరిగిన డ్రాలో బిగ్ టికెట్ తన డ్రీమ్ కార్ సిరీస్ విజేతను కూడా ప్రకటించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్ రుబెల్ సిద్దిక్ అహ్మద్.. ఇందులో విజేతగా నిలిచాడు. అతడు నవంబర్ 17న కొనుగోలు చేసిన నెం.020002 టికెట్ కు ఈ జాక్ పాట్ తగలడం విశేషం. దీంతో విలాసవంతమైన మసెరతి గ్రెకాలే (Maserati Grecale) కారును అతడు తనతో పాటు ఇంటికి తీసుకెళ్లనున్నారు.
Also Read: CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!
తెలంగాణ వాసికి రూ.240 కోట్లు
గత అక్టోబర్ లో తెలంగాణ వాసికి కూడా జాక్ పాట్ తలిగింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన 29 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగి బొల్లా అనిల్ కుమార్.. ఏకంగా రూ.240 కోట్లు గెలుచుకున్నాడు. యూఏఈలో భారతీయులు గెలుచుకున్న లాటరీ బహుమతిలో ఇదే అత్యధికం కావడం విశేషం. లాటరీలో జాక్ పాట్ తగలడంపై అనిల్ కుమార్ స్పందించారు. తన ఫ్యామిలీ మెుత్తాన్ని యూఏఈకి తీసుకొని రావాలని భావిస్తున్నట్లు చెప్పారు. లాటరీలో వచ్చిన డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడతానని స్పష్టం చేశారు.
