Loan Apps Ban: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలను వేధిస్తూ, భయపెడుతున్న లోన్ యాప్స్ పై ఉక్కుపాదం మోపింది. దేశంలోని నకిలీ, ప్రభుత్వ అనుమతి లేని 87 లోన్ యాప్స్ పై నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) లోక్ సభ వేదికగా వెల్లడించింది. సమాచార సాంకేతిక చట్టం – 2000లోని ఆర్టికల్ 69A కింద ఆయా అనాధికారిక లోన్ యాప్స్ పై చర్యలు తీసుకున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో స్పష్టం చేశారు.
ఫిర్యాదుల ఆధారంగా చర్యలు..
అధిక వడ్డీ పేరుతో ప్రజలను అప్పుల ఊబిలోకి లాగి మానసిక వేధింపులకు గురిచేస్తున్న లోన్ యాప్స్ ను కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కొత్త వినియోగదారులను అనుమానాస్పద యాప్‌ల బారిన పడకుండా కాపాడుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదైన వేధింపుల కేసులు, డేటా దుర్వినియోగం, మోసం వంటి ఆరోపణలను పరిగణలోకి 87 లోన్ యాప్స్ పై కేంద్రం ఈ నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఆయా యాప్స్ వ్యక్తిగత డేటాను దొంగిలించి.. వినియోగదారులపై మానసిక ఒత్తిడి తెచ్చేందుకు అనైతిక పద్దతులను అనుసరించినట్లు కేంద్రం నిర్ధారించింది.
కేంద్ర మంత్రి వార్నింగ్
లోన్ యాప్స్ నిషేధంపై కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘కంపెనీల చట్టం – 2013 ప్రకారం ఎక్కడైనా ఉల్లంఘనలు గుర్తిస్తే తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. ఐటీ చట్టం సాంకేతిక సామర్థ్యాన్ని, కంపెనీల చట్టంలోని న్యాయపరమైన అంశాల పట్ల ప్రభుత్వ వైఖరి కఠినంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు దేశ పౌరులను డిజిటల్ మోసాల నుండి రక్షించేందుకు కేంద్రం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోదని లోక్ సభ వేదికగా హర్ష్ మల్హోత్రా స్పష్టం చేశారు.
Also Read: Putin’s Aurus Senat Car: భారత్‌లో పుతిన్ పర్యటన.. అందరి కళ్లు ఆ కారు పైనే.. వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?
25 శాతం వడ్డీ వసూల్!
ఇదిలా ఉంటే దేశంలో లోన్ యాప్స్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. తమ వద్ద అప్పుగా తీసుకున్న నగదుపై ఏకంగా 25 శాతం వరకు వడ్డీలను వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. వినియోగదారుడు ఈ అధిక వడ్డీలను చెల్లించేందుకు నిరాకరిస్తే.. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లను పదే పదే బెదిరించడం, వారి వాట్సప్ కాంటాక్స్ట్ లోని వారికి ఫోన్ చేసి డబ్బు తీసుకున్న వ్యక్తి గురించి అసభ్యకరంగా చెప్పడం వంటి చర్యలకు పాల్పడినట్లు తేలింది. అయితే లోన్ యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసినప్పటికీ అవి కొత్త బ్రాండింగ్ పేరుతో పుట్టుకొస్తున్నట్లు సర్వేల్లో వెలుగుచూసింది. కొత్త పేర్లతో తిరిగి తమ కార్యకలాపాలను అవి కొనసాగిస్తుండటం కేంద్రానికి తలనొప్పిగా మారే ప్రమాదముంది.
