Putin’s Aurus Senat Car: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) నేటి నుంచి రెండ్రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే పుతిన్ ఏ విదేశీ పర్యటన చేసినప్పటికీ ఆయన కల్పించే కట్టుదిట్టమైన భద్రత హైలెట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా పుతిన్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆరస్ సెనేట్ లిమోసిన్ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరికొద్ది గంటల్లో పుతిన్ భారత్ కు రానున్న నేపథ్యంలో ఆయన రక్షణ కాన్వాయ్ లో ఆరస్ సెనేట్ సైతం చేరనుంది. ఈ నేపథ్యంలో ఈ కారు ప్రత్యేకతలు ఏంటి? ఎలాంటి సాంకేతికతతో రూపొందించారు? వంటి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పుతిన్ కారు నేపథ్యం..
ఆరస్ సెనట్ కారును రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. రష్యన్ రోల్స్ రాయిస్ కు చెందిన లగ్జరీ లిమోసిన్ కారును రష్యా సైనిక సాంకేతికత, ఆధునిక ఆటోమెుబైల్ ఇంజనీరింగ్ కలగలిపి అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఈ స్వదేశీ మోడల్‌కు ముందు వరకూ పుతిన్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-600 (Mercedes-Benz S 600 Guard Pullman) వాహనాన్ని వినియోగించేవారు. అయితే దిగుమతి చేసుకున్న వాహనాలను భద్రత కోసం వినియోగించకూడదని రష్యా నిర్ణయించింది. ఇందులో భాగంగా కోర్టేజ్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. దేశీయంగా నిర్మించిన వాహనాలను నాయకుల భద్రతకు అత్యంత అనువైనవిగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
క్షిపణి దాడులను తట్టుకునేలా..
2018లో పుతిన్ ప్రమాణ స్వీకార వేడుకలో తొలిసారి ఆరస్ సెనెట్ కారు ప్రవేశించింది. అత్యంత ప్రమాకర పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేక ఇంజనీరింగ్ నైపుణ్యంతో సెనెట్ ను తీర్చిదిద్దారు. ఈ కారు బాహ్య నిర్మాణం బుల్లెట్ ప్రూఫ్ రక్షణ కవచం (Fully Bulletproof Construction)గా పనిచేస్తుంది. అధిక కాలిబర్ (High-calibre bullets), ఆర్మర్-పియర్సింగ్ బుల్లెట్ల (Armour-piercing)ను కూడా ఇది తట్టుకోగలదు. అంతేకాదు క్షిపణి, డ్రోన్, వైమానిక దాడులను సైతం తట్టుకోగల రక్షణ వ్యవస్థను సెనెట్ కలిగి ఉంది. అంతేకాదు ప్రమాదవశాత్తు నీటిలో పడినా.. మునిగిపోని వ్యవస్థను దీనిలో అమర్చారు. ఫలితంగా నీటిలోనూ నౌక మాదిరిగా ఇది తేలుతుంది.
భద్రత, విలాసం మేళవింపుతో..
ఒకవేళ శత్రువులు సెనెట్ కారు టైర్లను పూర్తిగా నాశనం చేసినప్పటికీ ఇది వేగంగా ముందుకు ప్రయాణించగలదు. ఇందుకోసం రన్ ఫ్లాట్ టెక్నాలజీని సెనెట్ లో పొందుపరిచారు. కారు లోపలికి రసాయనాలు పంపి.. హత్యకు కుట్ర పన్నినా.. ఇందులోని ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఆ కెమికల్ ను వెంటనే నిర్వీర్యం చేసేస్తుంది. మరోవైపు సెనెట్ కారు పవర్ ఇంజన్ ను కలిగి ఉంది. కేవలం 6 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని ఇది అందుకోగలదు. ఇదిలా ఉంటే కారు బాహ్య భాగంలో ఏ స్థాయి రక్షణ వ్యవస్థను కలిగి ఉందో లోపల అంతకంటే ఎక్కువ స్థాయి విలాసవంతమైన సౌకర్యాలను ఈ సెనెట్ లో కల్పించారు. లెదర్ సీట్లు, చెక్క ప్యానెల్స్, క్లైమెట్ కంట్రోల్ సిస్టమ్, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది కలిగి ఉంది.
Also Read: Congress vs BJP: పవన్ వ్యాఖ్యల వెనక బీజేపీ కుట్ర? మండిపడుతున్న హస్తం నేతలు!
కారు ధర ఎంతంటే?
పుతిన్ వినియోగించే ఆరస్ సెనెట్ ప్రాథమిక మోడల్ ధర సుమారు 18 మిలియన్ రూబుల్స్. భారతీయ కరెన్సీలోకి అనువదిస్తే రూ.2.5 కోట్లు. అయితే పుతిన్ భద్రతకు బేస్ మోడల్ కారులో మార్పులు, చేర్పులు చేసినందున దీని ధర ఇంకో రెండు రెట్లు పెరిగి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సెక్యూరిటీ వెర్షన్ కార్లు.. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవు. ఇదిలా ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ లో చైనాలో జరిగిన షాంఘై సహకర సమాఖ్య (SCO) సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ ఇద్దరూ కలిసి సెనెట్ కారులో ప్రయాణించడం విశేషం. ఈ కారులో ఇరువురు నేతలు దాదాపు గంటపాటు చర్చలు జరిపినట్లు కథనాలు వచ్చాయి.
