Sathupalli OC project: సింగరేణి పరిధిలోని సత్తుపల్లి ఓసీ ప్రాజెక్ట్‌లో గార్డుల సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. పలు ఫిర్యాదులు, వినతులు ఉన్నప్పటికీ, మార్పు కనిపించకపోవడం గార్డులను నిరాశలో నెట్టేసింది.
అసలేం జరిగిందీ?
సత్తుపల్లి ఓసీ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. పలు ఫిర్యాదులు, వినతులు చేసినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో గార్డుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. విధుల్లో ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓసీ ప్రాజెక్ట్‌లో గార్డులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా, జూనియర్ ఇన్‌స్పెక్టర్ ప్రవర్తనపై గార్డులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లుగా అమల్లో లేని నియమాలను ఒక్కసారిగా కఠినంగా అమలు చేయడం, తన ఇష్టానుసారంగా ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలు వారికి భారంగా మారుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
తొలగిస్తా అనే బెదిరింపులు
ఇంతకు ముందు కొతగూడెం ఓసీలో కూడా జూనియర్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన వెంకటేశ్వరరావు, అక్కడి గార్డులతోనూ ఇదే తరహా ప్రవర్తన ప్రదర్శించినట్టు సమాచారం. డిప్యుటేషన్‌పై సత్తుపల్లి ఓసీకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇదే ధోరణిని కొనసాగిస్తున్నాడని గార్డులు పేర్కొన్నారు. తన మాట వినకపోతే విధుల్లోనుండి తొలగిస్తా అనే బెదిరింపులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాడని వారు వాపోతున్నారు. పై అధికారులు చెప్పిన మాటలను కూడా పట్టించుకోవడం లేదని గార్డులు ఆరోపిస్తున్నారు. రోజుకు కేవలం ₹675 వేతనంతోనే భారీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామనే వారు, అదనపు ఒత్తిడి, అనవసర ఆదేశాలు, అసహనకర డిమాండ్లు పని వాతావరణాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయని చెప్పారు.
Also Read: Local Body Elections: లోకల్ ఫైట్‌లో కాంగ్రెస్ మెగా ప్లాన్.. స్వయంగా సీఎం రేవంత్ మానిటరింగ్..!
మా ఇబ్బందులు పట్టించుకోడా?
ఎంత చెప్పినా వినడు… మా ఇబ్బందులు పట్టించుకోడు చివరికి తనకిష్టమైనట్టే చేస్తాడు. అని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న గార్డులకు దగ్గరకు వెళ్లి వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం, తనకు అనుకూలంగా మాట్లాడేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరిగినట్టు ఇటీవల బయటపడ్డ ఘటనపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోందని గార్డులు అంటున్నారు.
మేమూ మనుషులమే
పలుమార్లు వివరించినా, వినతులు సమర్పించినా ఎటువంటి చర్యలు కనిపించకపోవడం నిరాశకు గురిచేస్తోందని వారు తెలిపారు. “మేమూ మనుషులమే… మా కష్టాలు గుర్తించి పరిష్కారం చూపాలి” అని గార్డులు వేదన వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి ఓసీ ప్రాజెక్ట్ పరిస్థితిని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలిస్తే నిజాలు బయటపడతాయనీ, వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై సి.&.ఎండి.ఓ బహలరాం నాయక్, కొత్తగూడెం జీ.ఎం షాలోమ్ రాజు, అలాగే కొత్తగా బాధ్యతలు చేపట్టిన జీ.ఎం స్పందించాలని గార్డులు కోరుతున్నారు. సమస్యలు పదేపదే బయటపడుతున్నప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమని, తమ ఆవేదనకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే ఆశ మాత్రమే మిగిలిందని వారు తెలిపారు.
Also Read: Mulugu District: ములుగులో మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు, పోస్టర్లు కలకలం
