GHMC: జీహెచ్ఎంసీకి సంబంధించిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వెలుపల, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్‌బీ) విలీనం చేయాలన్న ప్రభుత్వ అనూహ్య నిర్ణయమే ఈ గందరగోళానికి కారణం. విలీన ప్రక్రియ ఇప్పటికే ముమ్మరం కాగా, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఒకవైపు విలీన కసరత్తు చేస్తూనే, మరోవైపు బడ్జెట్‌పై దృష్టి సారించారు.
బడ్జెట్ రూపకల్పనపై డైలమా
ఇప్పటికే 624 చదరపు కిలోమీటర్ల పరిధిలోని జీహెచ్ఎంసీ(GHMC) కి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపు కొలిక్కి వచ్చాయి. అయితే, విలీనం కానున్న 27 యూఎల్‌బీలను కూడా పరిగణలోకి తీసుకుని బడ్జెట్‌ను మళ్లీ రూపొందించాలా? లేక ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదాను ప్రస్తుత పాలక మండలి ఆదేశాల మేరకు ముందుకు తీసుకువెళ్లాలా? అనే డైలమాలో అధికారులు ఉన్నారు. ముఖ్యంగా, విలీనం అవుతున్న యూఎల్‌బీల ఆర్థిక మనుగడ ఏమిటన్న కోణంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో స్పెషల్ ఆఫీసర్ ఎంట్రీ.. మారనున్న హైదరాబాద్ రూపురేఖలు!
రూ.5,500 కోట్లకు పెరిగే అవకాశం
సర్కారు ఆదేశిస్తే, ప్రతిపాదిత యూఎల్‌బీలను కలుపుకుని బడ్జెట్ తయారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. విలీన ప్రక్రియ ముగిసే వరకు 27 స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను తయారు చేసి, తర్వాత జీహెచ్ఎంసీ బడ్జెట్‌లో కలిపి సవరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 2026-27 వార్షిక బడ్జెట్ అంచనాలు 11 వేల 50 కోట్లుగా ప్రతిపాదించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలు రూ.8,440 కోట్లుగా ఉన్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రిసీట్స్ రూ.5,550 కోట్లకు, క్యాపిటల్ వ్యయం రూ.5,500 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు బడ్జెట్ ప్రతిపాదనలు చెబుతున్నాయి.
11న స్టాండింగ్ కమిటీ భేటీ
నగరాభివృద్ధి, పరిపాలనకు సంబంధించి కీలక పాత్ర పోషించే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ నెల 11న జరగనున్నట్లు తెలిసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై చర్చ జరగనుంది. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి విలీనం కానున్న 27 పట్టణ స్థానిక సంస్థలను కలిపి బడ్జెట్ రూపొందించే విషయాన్ని కూడా సభ్యులు ప్రస్తావించే అవకాశాలున్నాయి.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో విలీనం పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. జీవో జారీ అప్పుడే..?
