Putin India Visit: రంగంలోకి టాప్ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు
చిరకాల మిత్రదేశమైన రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం భారత్‌లో (Putin India Visit) అడుగుపెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇండియా – రష్యా వార్షిక సదస్సుకు (India Russia Summit) హాజరు కాబోతున్నారు. అయితే, పుతిన్ భద్రత కోసం దేశరాజధాని ఢిల్లీలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్ సెక్యూరిటీ సర్వీస్‌కు చెందిన అత్యుత్తమ నైపుణ్యాలున్న సిబ్బంది ఇక్కడి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)కి చెందిన టాప్ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, ఏఐ మోనిటరింగ్ వ్యవస్థను మోమరించింది. పుతిన్ భారతదేశానికి చేరుకోకముందే ఆయన పర్యటించే ప్రాంతాలలో ఐదంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేసింది.
అత్యున్నత స్థాయి భద్రత
పుతిన్ పాల్గొనబోయే కార్యక్రమాలకు, ఆయన ప్రయాణించే మార్గాలలో అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికితోడు రష్యా నుంచి దాదాపు 50 మందికిపైగా టాప్ సెక్యూరిటీ సిబ్బంది ముందే ఢిల్లీ చేరుకొందని భద్రతా వర్గాలు తెలిపాయి. పుతిన్‌కు కల్పించే భద్రతలో ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఎస్‌జీ అధికారులతో పాటు ఈ రష్యా అధికారులు కూడా ఉంటారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా పుతిన్ కాన్వాయ్ ప్రయాణించే ప్రతి మార్గాన్ని ఇప్పటికే శానిటైజ్ చేస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్ భద్రత కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ప్రత్యేక డ్రోన్‌ల ద్వారా భద్రతను పర్యవేక్షించనున్నాయి.
ఈ డ్రోన్లు పుతిన్ కాన్వాయ్‌పై నిరంతరం నిఘా ఉంచేలా వాటిని మోహరిస్తారు. అంతేకాదు, పుతిన్ వాహన శ్రేణి ప్రయాణించే మార్గాలను స్నైపర్ల ద్వారా కవర్ చేస్తారు. అంతేనా, జామ్‌పర్లు, ఏఐ మోనిటరింగ్, వ్యక్తుల ముఖాల గుర్తింపు కెమెరాలు వంటి ప్రత్యేక టెక్ పరికరాలను కూడా మోహరించనున్నట్టు భద్రతా అధికారులు చెబుతున్నారు. పుతిన్ బస చేయబోయే హోటల్‌ను కూడా ఇప్పటికే పూర్తిగా శానిటైజ్ చేశారు. పుతిన్ సందర్శించే ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆకస్మికంగా సందర్శించే అవకాశం ఉన్న ప్రదేశాల జాబితాను కూడా సిద్దం చేసి, ఆ ఈ ప్రాంతాలను కూడా పూర్తిగా స్కాన్ చేస్తున్నారు.
పుతిన్ దిగిన వెంటనే..
అధ్యక్షుడు పుతిన్‌కు ఐదంచెల భద్రతా వలయాన్ని ప్లాన్ చేసినట్టు భద్రతా అధికారులు అంటున్నారు. పుతిన్ దిగిన వెంటనే ఒక్కో వలయం చురుకుగా పనిచేస్తుందని, భద్రతా విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉండి, వివరాలను అందజేస్తుంటారని పేర్కొన్నారు. ఐదు భద్రతా వలయాలలో ఎన్‌ఎస్‌జీ, ఢిల్లీ పోలీస్ అధికారులు బయటి అంచెలలో భాగంగా ఉంటారని, పుతిన్ భద్రతా సిబ్బంది లోపలి అంచెల భద్రతను చూసుకుంటారని అధికారులు పేర్కొన్నారు. ఇక, ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ కలిసివున్నప్పుడు మోదీకి (Narendra Modi) రక్షణ కల్పించే ఎస్పీజీ కమాండోలు కూడా లోపలి భద్రతా వలయంలో చేరుతారని చెప్పారు.
ప్రత్యేకంగా నిలవనున్న కారు
పుతిన్ భద్రత విషయానికి వస్తే, పటిష్ట రక్షణ, విలాసవంతమైన ‘ఆరస్ సెనాట్’ (Aurus Senat) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పుతిన్ భారతదేశ పర్యటన కోసం ఈ కారును మాస్కో నుంచి విమానంలో తీసుకొస్తున్నారు. ‘చక్రాలపై కదిలే కోట’గా సెనాట్‌ను అభివర్ణిస్తుంటారు. అధ్యక్షుడి భద్రత కోసం 2018లో దీనిని తయారు చేసి వాడుకలోకి తీసుకొచ్చారు. అధ్యక్షుడి అధికారిక వాహనంగా దీనిని ఉపయోగిస్తారు. ఈ కారులో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఏడాది చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా ఈ కారును ప్రధాని మోదీ ఎక్కారు. పుతిన్ ఆహ్వానం మేరకు ఆయన కారులో కొంతదూరం ప్రయాణించారు.
Read Also- Raipur ODI: కోహ్లీ, గైక్వాడ్ సెంచరీల మోత.. రాయ్‌పూర్ వన్డేలో భారీ స్కోర్ దిశగా టీమిండియా
