Sanchar Saathi App: కొత్తగా తయారు చేసే స్మార్ట్‌ఫోన్లు అన్నింటిలోనూ ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi App) యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాల్సిందేనంటూ మొబైల్ తయారీ కంపెనీలను రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త నిబంధన విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సైబర్ సెక్యూరిటీ కోసం ఉద్దేశించిన ఈ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాలేషన్ చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకున్నామని, సంచార్ సాథీ యాప్‌ను గత 24 గంటల్లోనే ఏకంగా 6 లక్షలకు పైగా యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకున్నామని, యూజర్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోందని, అందుకే, ప్రీ-ఇన్‌స్టాల్‌కు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ప్రీ-ఇన్‌స్టాల్ ద్వారా యాప్ వినియోగించేవారి సంఖ్యను వేగవంతం చేయాలని భావించినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది.
అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలోనూ సంచార్ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయడంతో పాటు దానిని అన్ఇన్‌స్టాల్, డిజేబుల్ చేసే అవకాశం ఉండకూడదంటూ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఫోన్లపై నిఘా పెట్టడానికేనంటూ విపక్ష పార్టీలు విమర్శలు చేయడం, వ్యక్తిగత గోప్యత హక్కులు ఉల్లంఘటనకు గురవుతాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. 2021లో పెగాసర్ స్పైవేర్ మాదిరిగానే ఉపయోగిస్తారని అనుమానాలు వ్యక్తం చేశాయి. వ్యతిరేకత తీవ్రతను గమనించిన కేంద్రం, ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
Read Also- Rupee Fall: ఒక్క డాలర్‌కు 90 రూపాయలు… దారుణంగా పతనం.. సామాన్యులపై ప్రభావం ఇదే!
కేంద్రం ప్రకటన ఇదే
సంచార్ సాథీ యాప్‌ని తప్పనిసరిగా ముందస్తుగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలనే నిబంధనను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది. ‘‘సైబర్ సెక్యూరిటీని పౌరులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ‘సంచార్ సాథి’ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయాలంటూ తప్పనిసరి చేశాం. ఈ యాప్ సురక్షితమైనది, సైబర్ ప్రపంచంలోని మోసగాళ్ల నుంచి పౌరులకు రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఆదేశాలు జారీ చేశాం. ఈ యాప్ వినియోగదారులను రక్షిస్తూనే, హానికర వ్యక్తులు, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడంలో పౌరులందరూ ప్రజలను భాగస్వామ్యం చేయడానికి సాయపడుతుంది. ఈ యాప్‌లో వినియోగదారులను మోసగాళ్ల నుంచి రక్షించడానికి మినహా వేరే ఫంక్షన్ ఏదీ లేదు. యూజర్లు కోరుకుంటే ఎప్పుడైనా యాప్‌ను తొలలగించవచ్చు’’ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక, ఇప్పటివరకు 1.4 కోట్ల మంది యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, రోజుకు 2,000 మోసపూరిత ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని అందించి సాయపడుతున్నారని వివరించింది. సంచార్ సాథీ యాప్‌ను వినియోగించేవారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలనే ఆదేశాలతో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనుకున్నామని తెలిపింది. సరైన అవగాహన లేనివారి కోసం యాప్‌ను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశించామని తెలిపింది.
కేవలం నిన్న (మంగళవారం) ఒక్క రోజులోనే 6 లక్షల మంది పౌరులు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని, దీంతో, యాప్ యజర్ల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ప్రస్తావించింది. ప్రభుత్వం అందించిన ఈ యాప్‌పై పౌరుల నమ్మకాన్ని ఈ సంఖ్య సూచిస్తోందని విశ్వాసం వ్యక్తం చేసింది.
Read Also- Fitness: రైస్-రొట్టెలే కాదు, ప్రోటీన్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి.. సెలబ్రిటీ ట్రైనర్ చెప్పిన హెల్తీ లంచ్
