Raipur ODI: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండవ సెంచరీ నమోదు చేశాడు. 90 బంతులో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే, సెంచరీ పూర్తయిన వెంటనే, వ్యక్తిగత స్కోర్ 102 పరుగుల వద్ద ఔటయ్యాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మార్క్రమ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆట 40 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 284 పరుగులుగా ఉంది. క్రీజులో కెప్టెన్ కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.
గైక్వాడ్ సూపర్ సెంచరీ
అంతకు ముందు యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీ మోత మోగించాడు. మొత్తం 83 బాల్స్ ఎదుర్కొని 105 పరుగులు సాధించాడు. మార్కో యన్సెన్ బౌలింగ్‌లో జోర్జీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, ఓపెనర్లు యశస్వి జైస్వాల్, దిగ్గజ ప్లేయర్ రోహిత్ శర్మ అంతగా ఆకట్టుకోలేకపోయారు. జైస్వాల్ 22, రోహిత్ 14 పరుగులు మాతమ్రే చేసి ఔటయ్యారు. ధాటికి ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యారు.
కోహ్లీ రికార్డుల మోత
ఈ మ్యాచ్‌లో నమోదు చేసిన సెంచరీతో వన్డేల్లో కోహ్లీ నమోదు చేసిన సెంచరీల సంఖ్య 53కు పెరిగింది. దీంతో, అంతర్జాతీయ క్రికెట్‌లో స్వదేశంలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన రెండవ ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. భారతదేశంలోని వేదికలపై కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య 40కి చేరింది. మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ మరింత మెరుగుపడింది. తాజా సెంచరీతో కలిపి అతడి మొత్తం సెంచరీల సంఖ్య 84కు పెరిగింది. అంతేకాదు, ఈ సెంచరీతో వన్డేల్లో సౌతాఫ్రికాపై హ్యాట్రిక్ శతకాలు నమోదు చేసినట్టు అయింది.
