Rupee Fall: దేశీయ కరెన్సీ రూపాయి పతనం (Rupee Fall) కొనసాగుతూనే ఉంది. బుధవారం నాడు మరింత పతనాన్ని చూసింది. మంగళవారం నాడు డాలర్ మారకంలో 89.95 వద్ద ముగిసిన రూపాయి, బుధవారం ట్రేడింగ్‌లో 90.31 కనిష్ఠ స్థాయిని రూపాయి తాక్కింది. రూపీ విలువ 90 కంటే దిగువకు పడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సంవత్సరం డాలర్‌తో పోలిస్తే ఆసియాలో అత్యంత పేలవంగా విలువ దిగజారుతున్న కరెన్సీలలో మన రూపాయి కూడా ఒకటిగా ఉంది. 90 మార్క్ అనేది మానసికంగా ఒక స్ట్రాంగ్ పాయింట్‌గా అనిపిస్తుంది, ఈ మార్క్‌ను దాటి కిందికి పడిపోవడంతో మున్ముందు ఇంకెంత దారుణ పతనాన్ని చూడాల్సి వస్తుందేమోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోలుకోవడానికి, బదులుగా 100 రూపాయల దిశగా పయనిస్తుందేమోనని విశ్లేషిస్తున్నారు.
పతనానికి కారణాలివే..
రూపాయి విలువ ఈ ఏడాది క్రమక్రమంగా పడిపోతూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త అత్యుల్ప పాయింట్లను తాకుతూ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఏకంగా 5 శాతం దిగజారింది. ఒక్క నవంబర్ నెలలోనే 0.8 శాతం పడిపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక, ఇందుకు దారితీస్తున్న కారణాల విషయానికి వస్తే, దేశీయ బ్యాంకులు పెద్ద మొత్తంలో అమెరికా డాలర్లను కొనుగోలు చేస్తుండడం, దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒక్క 2025లోనే విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి రూ1.53 లక్షల కోట్లు వరకు ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కి తీసుకున్నారని ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Read Also- CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు.. కేంద్రమంత్రులను ఆహ్వనించిన సీఎం రేవంత్..!
ఇక, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ సుంకాలు కూడా రూపాయిపై ఒత్తిడికి కారణమవుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రూపాయి విలువ మరింత పడిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. నిజానికి ముడి చమురు ధరలో కాస్త తగ్గడం, రూపాయి ఈ స్థాయిలోనైనా ఉండడానికి దోహదపడిందని, లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చని అంటున్నారు.
సామాన్యులపై ప్రభావం ఉంటుందా?
రూపాయి విలువ పతనం కావడం దేశీయ స్టాక్ మార్కెట్లు, ఫారెక్స్ ట్రేడర్స్ మీదనే కాకుండా, సామాన్యులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలహీనపడిన ప్రభావం, సామాన్య కుటుంబాలపై కూడా ఉంటుందంటున్నారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వ్యయాలు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మన దేశం వినియోగించే చమురులో 90 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదేనని ప్రస్తావించారు. మరోవైపు, విదేశాల్లో చదువుకుంటున్నవారికి కూడా ఫీజులు భారం అవుతాయని, సామాన్యులకు ప్రయాణ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. అదేవిధంగా, విదేశీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎరువులు, వంట నూనె వంటికి కూడా భారం అవుతాయని అంటున్నారు. వీటి కోసం విదేశీ సరఫరాదారులపై ఎక్కువగా ఆధారపడుతున్నామని, రూపాయి బలహీనం కావడంతో వీటిపై చెల్లింపులు పెరుగుతాయని, ఈ భారాన్ని నేరుగా కస్టమర్లపై మోపే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
