Chaiwala AI Video: ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi)పై రూపొందించిన ఏఐ వీడియో తాజాగా మరో రాజకీయ దుమారానికి కారణమైంది. అంతర్జాతీయ వేదికపై ప్రధాని టీ అమ్ముకుంటున్నట్లుగా ఏఐ వీడియోను రూపొందించారు. అందులో ప్రధాని మోదీ రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఓ చేతిలో టీ పాయ్, మరో చేతిలో గ్లాసులు పెట్టుకొని ఛాయ్ అంటూ అరుస్తున్నట్లుగా చూపించారు. ప్రధాని మోదీ తొలినాళ్లలో టీ అమ్ముకొని జీవించిన సంగతి తెలిసిందే. అయితే దానిని హాస్యస్పదం చేస్తూ ఏఐ వీడియోను రూపొందించడంపై బీజేపీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కాంగ్రెస్ నేత పోస్ట్..
కాంగ్రెస్ నేత రాగిని నాయక్ (Ragini Nayak).. ప్రధానికి సంబంధించిన ‘ఛాయ్‌వాలా ఏఐ వీడియో’ను షేర్ చేశారు. అందులో మోదీ పెద్దగా అరుస్తూ టీ అమ్ముతుండగా.. ఆయన వెనుక భారత్ సహా వివిధ దేశాలకు చెందిన ఫ్లాగ్స్ కనిపించాయి. అంతర్జాతీయ వేదికపై మోదీ.. టీ అమ్ముతున్న అర్థాన్ని ఈ ఏఐ వీడియో వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ ఏఐ వీడియోను బీజెపి జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా (Shehzad Poonawalla) తీవ్రంగా ఖండించారు.
अब ई कौन किया बे 🥴🤣 pic.twitter.com/mbVsykXEgm
— Dr. Ragini Nayak (@NayakRagini) December 2, 2025
బీజేపీ తీవ్ర ఆగ్రహం
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పెంపుడు శునకాన్ని తీసుకొచ్చి పార్లమెంటును అవమానించారని ఇప్పుడు రాగిని నాయక్ మోదీ నేపథ్యాన్ని ఎగతాళి చేశారని షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. అంతకుముందు బిహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా 150సార్లు ప్రధానిని దుర్భాషలాడారని అన్నారు. ఆఖరికి ఆయన తల్లిని కూడా అవమానించడాన్ని ప్రజలు గమనించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విపరీత పోకడలను ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Also Read: Hyderabad Crime News: నగరంలో తీవ్ర విషాదం.. వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!
బిహార్ ఎన్నికల టైంలోనూ..
ఈ ఏడాది సెప్టెంబర్ లో కూడా ప్రధాని మోదీపై ఓ ఏఐ వీడియోను కాంగ్రెస్ పార్టీ నేతలు వైరల్ చేశారు. బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చిన మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్లుగా ఏఐ వీడియోలో చూపించారు. సెప్టెంబర్ 10న ఐఎన్ సీ బిహార్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ కావడం గమనార్హం. అప్పట్లో దీనిపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఆ వీడియోను సమర్థించింది. అయితే ప్రధానిని గానీ, ఆయన తల్లిని గానీ అవమానించే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. ఒక తల్లి కుమారుడికి మంచి మార్గంలో నడవమని చెప్పడంతో తప్పేముందని కాంగ్రెస్ అధికారి ప్రతినిధి పవన్ ఖేరా అప్పట్లో వ్యాఖ్యానించారు.
