Warangal Politics: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామ పంచాయతీలోని బాలాజీ నగర్ తండాలో ఇప్పటివరకు బీఆర్ఎస్ (BRS) అగ్రహస్తంగా కొనసాగిన ఈ ప్రాంతం అకస్మాత్తుగా రాజకీయ తుపానుకు వేదికైంది. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సొంత గ్రామమైన ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్‌గా ఏకగ్రీవమవ్వడంతో స్థానిక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
సంక్షోభంలో బీఆర్ఎస్ ఉత్సాహంలో కాంగ్రెస్
మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే కాంగ్రెస్ కు వరం దొరకడం బీఆర్ఎస్ నాయకత్వంలో తీవ్ర ఆత్మపరిశీలనకు దారితీసింది. గ్రామంలో అభివృద్ధి పనుల విషయంలో ప్రజల్లో చాలాకాలంగా అసమ్మతి, అసహనం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్లు, తాగునీరు, వెలుగుల సమస్యలతో ప్రజలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పరిష్కారం లేకపోవడంతో బీఆర్ఎస్ పట్ల విసుగు పెరిగినట్టు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. యువత, పెద్దలు కలిసి సాగిన చర్చల అనంతరం ఏకగ్రీవానికి బాటలు వేయడం సునాయాసమైందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంతకాలం ఒకే పార్టీ… ఇక మార్పు కావాలి అనే భావన గుప్తంగా పెరిగి ఇప్పుడు పబ్లిక్‌గా బయటపడినట్టే అంటే అతిశయోక్తి కాదు.
బీఆర్ఎస్‌లో దుమారం ఇది ఎలా జరిగింది?
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సొంత గ్రామంలో కాంగ్రెస్‌కు ఇంత బలమైన మద్దతు లభించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మన గడ్డలో మన పార్టీ ఎందుకు ఓడింది..? ఎక్కడ లోపం జరిగింది..? అంటూ వీరి మధ్య అంతర్గత విమర్శలు రగులుతున్నాయి. తండాలో ఏకగ్రీవం వరకూ వెళ్లిన కాంగ్రెస్‌కు ఇది అయితే డబుల్ ధైర్యం. వాళ్లు ఈ విజయాన్ని రాబోయే స్థానిక ఎన్నికల దిశగా కీలక సంకేతంగా భావిస్తున్నారు.
Also Read: Warangal District: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థిని..!
ఇది ఇక ప్రారంభం మాత్రమే కాంగ్రెస్ శ్రేణులవ్యాఖ్యలు
కాంగ్రెస్ నాయకులు అయితే ఈ పరిణామాన్ని భారీ విజయంగా భావిస్తున్నారు. ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు… ఊకల్‌లో మొదలైన ఈ మార్పు ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా వ్యాపిస్తుంది అని వారు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
గ్రామంలో రాజకీయ చర్చలే
చెరువు బండ మీదైనా, పంచాయతీ ఆఫీసు ఎదుటైనా, తోట చెట్ల నీడ కిందైనా — ప్రస్తుతం ఊకల్‌లో వినిపించేది ఒక్కటే చర్చ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్రామంలో కాంగ్రెస్ ఏకగ్రీవమా..? స్థానిక రాజకీయ నిపుణులు మాత్రం ఈ సంఘటనను చిన్న విషయంగా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలపై ఈ ఏకగ్రీవం గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంమీద… ఊకల్ తండాలో సర్పంచ్ ఏకగ్రీవం సాధారణ నిర్ణయం కాదు అని ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త పెను మార్పులకు ఇది నాంది కావొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
