H-City Projects: గ్రేటర్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా పెరుగుతున్న రద్దీ, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులు ఎట్టకేలకు మరో అడుగు ముందుకు పడ్డాయి. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రూ. 7038 కోట్లతో అయిదు ప్యాకేజీలుగా మొత్తం 23 ప్రాజెక్టులు చేపట్టేందుకు పరిపాలనపరమైన మంజూరీ కూడా గత సంవత్సరం డిసెంబర్ మాసంలో సర్కారు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయటంతో పాటు అంచనా వ్యయం రూ. 7038 కోట్లకు పరిపాలనపరమైన మంజూరీ కూడా ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ పనుల్లో చాలా వరకు పనులను గ్రౌండింగ్ చేసేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ (ప్రాజెక్టులు) విభాగం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
రూ.1090 కోట్ల వ్యయంతో ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు
ఈ పనుల్లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ మొత్తం రూ.1090 కోట్ల వ్యయంతో ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి స్థల సేకరణను కూడా చేపట్టారు. స్థల సేకరణ కాకుండా రూ. 930 కోట్లతో రెండు ప్యాకేజీల కింద ఈ ప్రాజెక్టు సివిల్ పనులు, యుటిలిటీల బదలాయిపంపు పనులను చేపట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. అంతకు ముందే టెండర్ల ప్రక్రియను చేపట్టగా, ఈ ప్రాజెక్టులను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ పనులను కైవసం చేసుకుంది. స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో కొంత అడ్డంకులేర్పడటంతో స్థల సేకరణ ప్రక్రియను కొలిక్కి తెచ్చేందుకు నేరుగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ రంగంలోకి దిగి, స్థలాలు ఇవ్వాల్సిన యజమానుల్లో ఒకరైన మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి చర్చించారు.
స్థల సేకరణకు సంబంధించి కొన్ని ఆస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలున్నా, వివాదాలు లేని చోట పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్దం చేసింది. అమీన్ పూర్ రోడ్డు నిర్మాణ పనులను శివసత్య ఏజెన్సీ, కూకట్ పల్లి వై జంక్షన్ లో అటు మియాపూర్ వరకు, ఇటు అమీర్ పేట వైపు రెండు డైరెక్షన్లలో నిర్మించనున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను స్థల సేకరణ మినహా రూ. 112 కోట్లతో సివిల్ పనులను కేఎన్ఆర్ సంస్థ చేపట్టనుంది. ప్రస్తుతం గ్రౌండింగ్ అవుతున్న ఈ పనులు మరో నెల రోజుల్లో ఫీల్డు లెవెల్ లో ఊపందుకోనున్నాయి.
Also Read: H-City Project: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.5942 కోట్లతో కొత్త రోడ్ ప్రాజెక్టులు ప్రారంభం
టెండర్ల ప్రక్రియకు ఈ నెల 7 డెడ్ లైన్
ఆర్కేపురం, శేరిలింగంపల్లిలో నిర్మించ తలపెట్టిన రెండు ఆర్వోబీలకు ఇప్పటికే రైల్వే శాఖ నుంచి క్లియరెన్స్ రావటంతో ఇక టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు సిద్దమవుతున్నారు. టెండర్లు చేపట్టని హెచ్ సిటీ పనులకు ఈ నెల 7వ తేదీలోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రసూల్ పురాలో నిర్మించనున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ఇప్పటికే కేఎన్ఆర్ సంస్థ చేజిక్కించుకోగా, పాటిగడ్డలో నిర్మించనున్న ఫ్లై ఓవర్ పనులకు టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిసింది.
మరో ఫ్లై ఒవర్ నిర్మాణానికి సివిల్ పనులు
ఎన్ఎఫ్ సీఎల్ నుంచి టీవీ9 వరకు రూ.252 కోట్లతో, త్రిబుల్ ఐటీ గచ్చిబౌలీలో మరో ఫ్లై ఒవర్ నిర్మాణానికి సివిల్ పనులు చేపట్టేందుకు వీలుగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హెచ్ సిటీ కింద అన్ని ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ఈ నెల 7వ తేదీని డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 8, 9వ తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో భాగంగా హెచ్ సిటీ పనుల కోసం ఇంజనీరింగ్ వింగ్ మొత్తం పీల్డు లెవెల్ విధుల్లో నిమగ్నం కానున్నట్లు అధికార వర్గాల సమాచారం.
భూసార పరీక్షలు..జీపీఆర్ సర్వేలు
హెచ్ సిటీ కింద చేపట్టనున్న ప్రతి ప్రాజెక్టు నిర్మాణానికి క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భూసార పరీక్షలు, గ్లోబర్ పొజీషన్ రిఫరెన్స్ (జీపీఆర్) సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని ప్రాజెక్టుల పనులను గ్రౌండింగ్ చేసే మరో నెల రోజుల్లో పనులను ఫీల్డు లెవెల్ లో మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ పనులు జరుగుతున్న చోట ట్రాఫిక్ మళ్లింపు అంశంపై ఇప్పటికే సిటీ ట్రాఫిక్ పోలీసులతో ఇంజనీరింగ్ విభాగం అధికారుల సమావేశం కూడా ముగిసినట్లు, పనుల ప్రారంభానికి ముందే సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. హెచ్ సిటీ పనుల కింద చేపట్టనున్న ప్రాజెక్టు పనుల్లో భాగంగా వంద పిల్లర్లతో నిర్మించనున్న కేబీఆర్ హెచ్ సిటీ పనులకు తొలుత నాలుగైదు పిల్లర్ల నిర్మాణానికి సంబంధించి ఫార్మాల్టీగా భూసార పరీక్షలు చేసిన అధికారులు ఇపుడు మొత్తం వంద పిల్లర్ల నిర్మాణానికి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ పనులు చేపట్టే ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ లో పరిస్థితులను అంచనా వేసేందుకు జీపీఆర్ సర్వేలు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.
Also Read: H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

