H-City Project: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ(H-City) పనులు కేవలం ప్రతిపాదనలకే పరిమితం కానున్నాయా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వింగ్ లోని లొసుగులు అవుననే సమాధానం చెబుతున్నాయి, ముఖ్యంగా సాధారణంగా సిటీలో ఏ ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నా ముందుగా అందుకు అవసరమైన స్థల సేకరణ 90 శాతం పూర్తయితే గానీ టెండర్ల ప్రక్రియ చేపట్టరు. కానీ హెచ్ సిటీ పనులకు సంబంధించి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సిటీలో మొత్తం అయిదు ప్యాకేజీలుగా 23 ప్రాజెక్టులను చేపట్టేందుకు అనుమతినివ్వటంతో పాటు సర్కారు రూ. 7038 కోట్ల నిధులకు పరిపాలనపరమైన అనుమతులు కూడా జారీ చేసింది. ఇందులో నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1090 అంచనా వ్యయంతో ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఆరు అండర్ పాస్ లున్నాయి.
స్థల సేకరణ ప్రక్రియ
మిగిలిన ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లతో పాటు రోడ్ అండర్ బ్రిడ్జి, రోడోవర్ బ్రిడ్జి వంటి ఇతర ప్రాజెక్టులున్నాయి. ఈ పనులకు గత సంవత్సరం డిసెంబర్ మాసంలో ఈ పనులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రె(CM Revanth Reddy)డ్డి శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఈ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేబీఆర్ పార్కు(KBR Park) నానల్ నగర్, త్రిబుల్ ఐటీ, ఖజాగూడ హెచ్ సిటీ పనులకు సంబంధించి స్థల సేకరణ ప్రక్రియ పూర్తి కాకముందే జీహెచ్ఎంసీ ఇంజనీర్లు ఈ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా స్థల సేకరణ 90 శాతం పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన టెండర్ల ప్రక్రియను ముందుగానే చేపట్టి ఏజెన్సీలను ఎంపిక చేసి, అనుమతి కోసం సర్కారుకు ప్రతిపాదనలు పంపటం ఏజెన్సీలతో, అధికారులు ఏమైనా మిలాఖాత్ అయ్యారా? అన్న అనుమానాలకు తావిస్తుంది.
Also Read: Konda Surekha: తెలంగాణను ఎకో టూరిజం హబ్ చేయాలి.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
ఫలితమివ్వని సమీక్షలు
హెచ్ సిటీ పనుల పురోగతిపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించి, పనులు ముందుకు సాగకపోవటంపై తీవ్ర స్థాయిలో అసహానాన్ని వ్యక్తం చేయటంతో ప్రత్యేక చొరవ తీసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) గడిచిన మూడు వారాల నుంచి ప్రతి మంగళవారం వీక్లీ రివ్యూలు నిర్వహిస్తున్నా, పనులపై ఎలాంటి ఎఫెక్టు చూపటం లేదన్న అభిప్రాయాలున్నాయి. హెచ్ సిటీ పరిధిలోకి తీసుకువచ్చిన ఎస్ఎన్ డీపీ పనులపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో కాస్త సంతృప్తిని వ్యక్తం చేసిన కమిషనర్ హెచ్ సిటీ పనులు ముందుకు సాగకపోవటంపై తీవ్ర అసహనంగా ఉన్నట్లు సమాచారం. సదరు ఇంజనీర్ తాను సీఎం మనిషిని అంటూ పలు చోట్ల వ్యాఖ్యానించినందున ఆయన్ను జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల విభాగం చీఫ్ ఇంజనీర్ బాధ్యతల నుంచి తొలగించేందుకు కమిషనర్ వెనకంజ వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
జంట పదవులతోనే జాప్యం
హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హెచ్ సిటీ పనులను ముందుకు నడిపించాల్సిన జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం హెడ్, చీఫ్ ఇంజనీర్ కు జంట పదవులున్నందున ఆయన హెచ్ సిటీ పనులపై ఎక్కువగా శ్రద్ధ చూపలేకపోతున్నారన్న వాదన ఉంది. చీఫ్ ఇంజనీర్ తో పాటు సదరు అధికారికి పబ్లిక్ హెల్త్ విభాగంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ బిజీగా ఉండటం వల్లే హెచ్ సిటీ పనులకు సమయం కేటాయించలేకపోతున్నారన్న వాదన ఉంది. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఇటీవలే చేపట్టిన బదిలీలపై ఉన్న శ్రద్ధ ప్రజల సౌకర్యార్థం చేపట్టాల్సిన హెచ్ సిటీ పనులపై సదరు ఇంజనీర్ కు లేదంటూ ఇంజనీరింగ్ విభాగంలో చర్చ జరుగుతుంది.
Also Read: Temple Land Scam: ఆలయ భూములు కబ్జాలో ఈ జిల్లా టాప్..? ఎంతో తెలిస్తే షాకైపోతారు..?