Breakfast 2.0: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం చుట్టూ గత కొన్ని రోజులుగా వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. సిద్ధరామయ్యను తప్పించి తనను ముఖ్యమంత్రిని చేయాలని డీకే శివకుమార్ హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ప్రచారం సాగుతున్న నేపథ్యంలోని ఇటీవల సీఎం సిద్ధరామయ్యతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ భేటి నిర్వహించారు. తమ మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా డీకే శివకుమార్ నివాసానికి సీఎం సిద్ధరామయ్య వెళ్లి అల్పాహారం సేవించడం ఆసక్తికరంగా మారింది.
3 రోజుల్లో.. రెండు సార్లు
కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతున్న వేళ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెళ్లారు. ప్రభుత్వంలోని ఇద్దరు అగ్రనేతలు ఒకరింటికి మరొకరు వెళ్లడం రాజకీయాల్లో సర్వ సాధారణమే. కానీ సీఎం సీటుపై రగడ జరుగుతున్న క్రమంలో వీరిద్దరు మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు బ్రేక్ ఫాస్ట్ పేరుతో సమావేశం కావడం కన్నడ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. తన ఇంటికి వచ్చిన సీఎంకు ఇడ్లీ, గ్రామీణ శైలిలో తయారు చేసిన చికెన్ కర్రీ, ఒక కాఫీని అల్పాహారం కింద డీకే అందించారు.
పవర్ షేరింగ్ పై చర్చ..
నేడు జరిగిన బ్రేక్ ఫాస్ట్ భేటిలోనూ పవర్ షేరింగ్ గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సీటు పంచాయతీని కాంగ్రెస్ అధీష్టానానికి వదిలిపెట్టి.. సామరస్యంగా ముందుకు సాగాలని ఇరువురు నేతలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో 2028 ఎన్నికల దృష్ట్యా పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇద్దరూ చర్చించినట్లు టాక్. గత శనివారం (నవంబర్ 29) సీఎం సిద్దరామయ్య ఇంటికి డీకే శివకుమార్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆరోజు అల్పాహారంలో ఇడ్లీ, ఉప్మా, కేసరి, కాఫీ ఇచ్చినట్లు సమాచారం.
వివాదానికి కేంద్రం బిందువు
2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో సీఎం సీటు కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో చెరొక రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేందుకు వారు ఒప్పందం చేసుకున్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒప్పందం ప్రకారం గత నెలతోనే సీఎం సిద్దరామయ్య గడువు పూర్తైంది. దీంతో డీకే శివకుమార్.. సీఎం సీటు కోసం సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచినట్లు కథనాలు వచ్చాయి.
Also Read: Minister Seethakka: ఈశ్వరి బాయి స్ఫూర్తి చిరస్థాయి.. సీతక్కకు మెమోరియల్ అవార్డు ప్రదానం!
త్వరగా తేల్చుకోండి: ఖర్గే
మరోవైపు కర్ణాటక పవర్ షేరింగ్ పంచాయతీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. 2023లో ఆ ఒప్పందం తన సమక్షంలోనే కుదిరిందని.. తన రాష్ట్రంపై తాను నమ్మకం కోల్పోకూడదంటే ఆ మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ వివాదాన్ని ఇరువురు నేతలు త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఖర్గే ఆదేశించినా.. ఇప్పటివరకూ కూడా పవర్ షేరింగ్ విషయంలో క్లారిటీ రాకపోవడం గమనార్హం.

