Minister Seethakka: దళితులు, మహిళల ఉద్ధరణ కోసం తన జీవితాన్ని ధార పోసిన ఆదర్శ మహిళ ఈశ్వరి బాయ్ అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే ఈశ్వరీబాయి 107వ జయంతి ఉత్సవాలు రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, మంత్రి సీతక్కకు ఈశ్వరి బాయ్ మెమోరియల్ అవార్డును మంత్రి వివేక్‌తో కలిసి స్పీకర్ అందజేశారు. అవార్డుతో పాటు శాలువాతో సీతక్కను ఘనంగా సన్మానించారు. స్పీకర్ మాట్లాడుతూ, ఈశ్వరి బాయ్ తాను చెప్పాలనుకున్న విషయాలను సూటిగా చెప్పిన ధైర్యవంతురాలు అన్నారు. ఈశ్వరి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శవంతురాలని, మహిళలు రాజకీయ రంగంలోకి వచ్చేందుకు ఆమె ప్రేరణగా నిలిచారన్నారు. కడదాకా సిద్ధాంతం మీద నిలబడ్డ ఆదర్శవంతురాలు ఈశ్వరి అని స్పీకర్ కొనియాడారు.
Also Read: Minister Seethakka: చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
బాధ్యతను పెంచింది
అవార్డు అందుకున్న మంత్రి సీతక్క, ‘జై భీమ్ జోహార్ ఈశ్వరి బాయ్’ అంటూ ఆమె స్ఫూర్తికి వందనం తెలిపారు. ఈశ్వరి బాయ్ మెమోరియల్ అవార్డు తనకు ఇవ్వడం ద్వారా మరింత బాధ్యతను అప్పగించినట్టే అని చెప్పారు. ఈ అవార్డు తన పనితీరును మరింత మెరుగుపర్చడానికి ప్రేరణనిస్తుందన్నారు. ఈశ్వరి బాయ్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, వాటిని కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, కార్పొరేటర్ విజయరెడ్డి పాల్గొన్నారు.
Also Read: Minister Seethakka: అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు.. సొంత భవనాలకు నిధులివ్వండి!
