Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. జైలులో దారుణ హత్యకు గురయ్యారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రావల్పిండి జైలులో ఉన్న ఇమ్రాన్ ను చూసేందుకు ఇప్పటివరకూ కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నారని జైలు అధికారులు ప్రకటించినప్పటికీ.. దానిని తెహ్రీక్ – ఇ – ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 3 రోజుల పాటు 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకొచ్చింది.
మూడు రోజుల పాటు..
పాకిస్థాన్ లోని రావల్పిండి ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తూ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ హసన్ వకార్ చిర్మా (Dr Hassan Waqar Cheema) ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 1 నుంచి 3 వరకూ మూడు రోజుల పాటు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి రావల్పిండి ప్రాంతంలో ఏ రకమైన సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమ్మికూడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అటు లౌడ్ స్పీకర్ల వినియోగంపైనా అధికారులు నిషేధం విధించారు.
అల్లర్లపై తీవ్ర హెచ్చరిక
ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రావల్పిండిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ (DIC) హెచ్చరించింది. పెద్ద ఎత్తున సమావేశాలు, నిరసనలు, అల్లర్లు జరిగే అవకాశముందని అంచనా వేసింది. రావల్పిండిలోని సున్నితమైన ప్రాంతాల్లో హింస చెలరేగవచ్చని సూచించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న డిప్యూటీ కమిషనర్.. రావల్పిండి వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Telangana Fishermens: చేప పిల్లల పంపిణీలో అధికారుల నత్తనడక.. నీరు సమృద్ధిగా నిరాశలో మత్స్యకారులు
ఇమ్రాన్ బతికే ఉన్నారా?
ఇమ్రాన్ ఖాన్ మరణంపై పెద్ద ఎత్తున పుకార్లు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఫ్యామిలీ తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. రావల్పిండిలోని అదియాలా జైలు అధికారులు చెబుతున్నట్లుగా తమ తండ్రి క్షేమంగా ఉంటే చూసేందుకు తమను అనుమతించాలని కుమారులు డిమాండ్ చేస్తున్నారు. తమ తండ్రిని ప్రత్యక్షంగా చూసి నెల రోజులు దాటిపోయిందని.. ఆయన బతికే ఉన్నాడని చెప్పేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కు తొలి వరల్డ్ కప్ ను అందించిన క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్.. 2023 ఆగస్టు నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
